రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సారథిగా ఎర్రబెల్లి స్వర్ణ
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:47 AM
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ/హనుమకొండ సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమె నియామకానికి ఆమోదం తెలిపారని.. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు ఎర్రబెల్లి స్వర్ణ.. 45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. 1991లో తొలిసారి ఆమె వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా కాంగ్రెస్ స్థాయి పదవుల్లో కొనసాగారు. 2005లో వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 2023లో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2025 నవంబరు వరకు ఆ పదవిలో కొనసాగారు. 45 ఏళ్లుగా పార్టీ కోసం శాయశక్తులా పనిచేసిన తనను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడం పట్ల స్వర్ణ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.