Share News

పీఎఫ్‌ ట్రస్ట్‌లకు ‘క్షమాభిక్ష’

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:26 AM

దేశవ్యాప్తంగా పీఎఫ్‌ ట్రస్ట్‌లను నిర్వహిస్తున్న సంస్థలు తమ పాత తప్పులను క్రమబద్ధీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కని అవకాశం కల్పించింది.

పీఎఫ్‌ ట్రస్ట్‌లకు ‘క్షమాభిక్ష’

  • క్రమబద్ధీకరణకు 6నెలలపాటు అవకాశం

  • పెండింగ్‌ కేసులు, జరిమానాల నుంచి విముక్తి

హైదరాబాద్‌ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పీఎఫ్‌ ట్రస్ట్‌లను నిర్వహిస్తున్న సంస్థలు తమ పాత తప్పులను క్రమబద్ధీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కని అవకాశం కల్పించింది. ఆదాయపన్ను చట్టం, 1961 కింద గుర్తింపు పొంది, భవిష్యనిధి ట్రస్ట్‌లను నడిపిస్తున్న సంస్థలకు ఈ వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం ‘ఆమ్నెస్టీ స్కీమ్‌’ను (క్షమాభిక్ష పథకం) ప్రకటించింది. దీనికింద దరఖాస్తు చేసుకునే సంస్థలకు పాత పెండింగ్‌ కేసులు, జరిమానాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగుల భవిష్యనిధి చట్టం, 1952లోని సెక్షన్‌ 17కింద మినహాయింపు పొందిన ప్రావిడెంట్‌ ట్రస్ట్‌లకే ‘ఆదాయపన్ను చట్టం, 2025’ కింద గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. గత నెల 29న ఈ పథకాన్ని నోటిఫై చేయగా, అక్కడి నుంచి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. ట్రస్ట్‌ ప్రారంభించిన నాటి నుంచి కటాఫ్‌ తేదీ వరకు పాత నిల్వలకు ఈ పథకం కింద క్రమబద్ధీకరణ పొందొచ్చు. సామాజిక భద్రతా కోడ్‌, 2020 కింద కనీస ఉద్యోగుల సంఖ్య, నిధుల పరిమాణానికి సైతం ఉపశమనం లభిస్తుంది. నిబంధనల ప్రకారం సభ్యుల ఖాతాల్లో భవిష్య నిధిని, వడ్డీని జమ చేసినట్టయితే.. గతంలో జారీ చేసిన బకాయిలు, నష్టపరిహారం, వడ్డీ చెల్లింపులకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న ఆదేశాలన్నీ రద్దు అవుతాయి. అర్హత కలిగిన సంస్థలు ఈపీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా rc.exemption@epfindia.gov.in కు సైతం ఆసక్తి తెలియజేయొచ్చని ఈపీఎ్‌ఫవో ప్రకటించింది.

Updated Date - Jul 12 , 2026 | 06:38 AM