తన అడవితల్లి ఒడిలోనే రక్తసిక్తమై..
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:53 AM
ప్రకృతి అంటే ఆయనకు ఎంత ప్రేమో.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏళ్లతరబడి కష్టపడి వందలు, వేల మొక్కలను నాటి 70 ఎకరాల తన సొంత భూమిని పచ్చని అడవిగా మార్చేశారాయన....
ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్ల సత్యనారాయణపై కర్రలు, గొడ్డలితో దాడి.. గొర్రెల కాపర్ల దుర్మార్గం
ఆయన అభివృద్ధి చేసిన 70 ఎకరాల అడవిలోనే ఘటన
గొర్రెలు మేపొద్దు.. చెట్లు కొట్టొద్దు అని వారించినందుకే
మోతె, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి అంటే ఆయనకు ఎంత ప్రేమో.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏళ్లతరబడి కష్టపడి వందలు, వేల మొక్కలను నాటి 70 ఎకరాల తన సొంత భూమిని పచ్చని అడవిగా మార్చేశారాయన! తలా ఓ మొక్క నాటేలా ఎంతోమందికి ఇలా నిలువెత్తు స్ఫూర్తిగా నిలిస్తే తాను పెంచిన పచ్చని చెట్ల మధ్యే ఆయన నెత్తురు కళ్లచూశారు కొందరు దుండగులు. ఆ అడవిలో పశువులను మేపొద్దు.. చెట్లు నరకొద్దు అని వారించినందుకు కర్రలు, గొడ్డలితో ఆయనపై దాడి చేశాడు. బాధితుడు ప్రముఖ పర్యావరణవేత్త దుశ్శర్ల సత్యనారాయణ! గురువారం సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై అజయ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాఘవాపురం గ్రామానికి చెందిన జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్శర్ల సత్యనారాయణ తనకు వారసత్వంగా వచ్చిన గ్రామ రెవెన్యూ పరిధిలోని 70ఎకరాలను 15 ఏళ్లు కష్టపడి చక్కని అటవీప్రాంతంగా తీర్చిదిద్దారు. నల్లగొండలో ఉంటూ వారంలో రెండు రోజులు ఆ అటవీ క్షేత్రానికి వచ్చి వెళుతుంటారు. విద్యార్థులు, పర్యావరణవేత్తలు అటవీ ప్రాంతానికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు, కాపర్లు గేదెలను, మేకలను మేపుతుండటంతో పాటు, చెట్లనూ నరుకుతున్నారు. గురువారం రాఘవాపురానికి చెందిన గొర్రెల కాపర్లు బయ్య గంగయ్య, మల్లయ్య ఆ అడవిలో చెట్లను నరుకుతూ గొర్రెలను మేపుతుండగా అక్కడికి వెళ్లిన సత్యనారాయణ.. ఈ అడవిలోకి రావొద్దని, గొర్రెలను మేపొద్దని, చెట్లను నరకొద్దని వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ఇద్దరు గొర్రెల కాపర్లు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆ కాపర్లకు మద్దతుగా వారి కుటుంబసభ్యులు బయ్యా రోశాలు, సుమలత, యశ్వంత్, అనూషవచ్చి.. సత్యనారాయణపై కర్రలు, గొడ్డలితో దాడి చేశారు. దీంతో సత్యనారాయణ తలకు బలమైన గాయమైంది. స్థానికులు ఆయన్ను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.