Share News

సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ!

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:43 AM

తన తాత తండ్రికి తండ్రి.. అంటే ముత్తాతకు తండ్రి అవుతాడు. తానుండేదేమో ఇంగ్లండ్‌లో! ముత్తాత తండ్రి కన్నుమూసింది భారత్‌లో! రాబిన్‌ డిక్సన్‌ అనే వ్యక్తి ముత్తాత అయిన...

సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ!

  • ఇంగ్లండ్‌ నుంచి వచ్చి నివాళి!

  • సికింద్రాబాద్‌లో ముత్తాత తండ్రి సమాధి వద్ద నివాళులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తన తాత తండ్రికి తండ్రి.. అంటే ముత్తాతకు తండ్రి అవుతాడు. తానుండేదేమో ఇంగ్లండ్‌లో! ముత్తాత తండ్రి కన్నుమూసింది భారత్‌లో! రాబిన్‌ డిక్సన్‌ అనే వ్యక్తి ముత్తాత అయిన చార్లెస్‌ విల్సన్‌ ఎప్పుడో 130 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో భాగంగా సికింద్రాబాద్‌ రెజిమెంట్‌లో రవాణా వ్యవహారాల విభాగంలో లెఫ్టినెంట్‌గా పనిచేశాడు.. అక్కడే కన్నుమూశాడు! ముత్తాత భారత్‌లో పనిచేసి.. భారత్‌లోనే కన్నుమూసినట్లు రాబిన్‌ ఇంట్లోని అరలో దొరికిన పాత ఫైళ్ల ఆధారంగా తెలుసుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ముత్తాత సమాఽధిని సందర్శించి మనఃపూర్వకంగా నివాళులర్పించాలకున్నారు రాబిన్‌. ఇందుకు ఆయన.. ముత్తాత చార్లెస్‌ సమాధి కోసం 19 ఏళ్లుగా అన్వేషిస్తున్నారు. చివరికి రవిరెడ్డి అనే పాత్రికేయుడి సహకారంతో ముత్తాత సమాధి తిరుమలగిరి సిమెట్రి-12లో ఉందని 8నెలల క్రితమే ఆయన తెలుసుకున్నారు. భార్య లిన్‌తో కలిసి రాబిన్‌ ఇంగ్లండ్‌ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కొచ్చారు. ముత్తాత చార్లెస్‌ విల్సన్‌ సమాధిపై తెల్లని గులాబీ పువ్వు ఉంచి కన్నీటిబొట్లు కార్చారు. ఈ సందర్భం కోసం తాను ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని రాబిన్‌ చెప్పారు.


ఎవరీ చార్లెస్‌?

ఇంగ్లండ్‌లోని వెవర్టన్‌ గ్రామంలో 1858లో చార్లెస్‌ విల్సన్‌ జన్మించారు. 1880లో బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. భారత్‌కొచ్చి బెంగళూరులో కొన్నాళ్లు, మద్రాసు (ప్రస్తుత చెన్పై)లో కొన్నాళ్లు పనిచేశాడు. తర్వాత సికింద్రాబాద్‌కొచ్చి రవాణా ఇతర సరఫరా వ్యవహారాల విభాగంలో లెఫ్టినెంట్‌గా సేవలందించారు. ఆ సమయంలోనే అనారోగ్యంతో తిరుమలగిరిలోని స్టేషన్‌ ఆస్పత్రిలో చేరి.. 48 ఏళ్ల వయసులో 1906 ఆగస్టు 4న కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని తిరుమలగిరి సిమెట్రీలో ఖననం చేశారు. విల్సన్‌ చనిపోయిన ఏడాదిలోపే ఆయన భార్య హ్యారీయేట్‌ నలుగురు పిల్లలను తీసుకొని ఇంగ్లండ్‌ వెళ్లిపోయారు. విల్సన్‌కు సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నా ఆయన సమాధి ఎక్కడ ఉంది? బెంగళూరులోనా? మద్రాసులోనా? సికింద్రాబాద్‌లోనా? అన్నది మాత్రం ఇన్నాళ్లు వారి కుటుంబసభ్యులు గుర్తించలేకపోయారు. జర్నలిస్టు రవిరెడ్డి సహకారం వల్లే సమాధిని గుర్తించగలిగామని రాబిన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 17 , 2026 | 06:44 AM