గోదావరి పుష్కరాలపై ఇంజనీర్ల కమిటీ
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:47 AM
గోదావరి పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అనువైన ప్రదేశాల గుర్తింపు కోసం ఏర్పాటు
క్యాబినెట్ సబ్‌కమిటీ భేటీలో సీఎం ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 15-20 రోజుల్లో నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై క్యాబినెట్ సబ్ కమిటీ అసెంబ్లీలో ఆదివారం సమావేశమైంది. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి పంపాలని ఆదేశించారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తర్వాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం తెలిపారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేేసలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్‌లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞానసరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం పలు సూచనలు చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. 2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులను గుర్తించారు. పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్‌ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.