ఇంజినీరింగ్ ప్రవేశాలు 19 నుంచి
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:33 AM
ఇంజినీరింగ్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ సమావేశం సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది.
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ సమావేశం సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న అధ్యక్షుడు బాలకిష్టారెడ్డి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి విడతలో భాగంగా దరఖాస్తులను ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు స్వీకరించనున్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న విద్యార్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలన ఈనెల 22 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తారు. జూన్ 25 నుంచి జూలై 1వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. గత ఏడాది అమలుచేసిన మాక్ సీట్ కేటాయింపు ఈసారి కూడా కొనసాగించనున్నారు. నిరుడు ఈ అవకాశాన్ని 44వేల మంది విద్యార్థులు వినియోగించుకున్నారు. మొదటి విడతలో జూలై 4 లోపు మాక్ సీట్ ప్రదర్శిస్తారు. ఆప్షన్లలో మార్పులు చేర్పులకు జూలై 7వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూలై 10లోపు మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రకటిస్తారు. ఈసారి ఎప్‌సెట్ కౌన్సెలింగ్ మూడు విడతల్లో నిర్వహించనున్నారు. జూలై 17 నుంచి రెండో విడత, జూలై 31 నుంచి చివరి విడత కౌన్సెలింగ్ ఉంటుంది. ఈసారి కౌన్సెలింగ్‌తోపాటే బీ-కేటగిరి సీట్లను సైతం భర్తీ చేయనున్నారు. ప్రతి ఏటా కౌన్సెలింగ్ పూర్తయ్యాక దీని కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ విడుదల చేస్తుండగా.. ఈసారి ఒకేసారి నిర్వహించనున్నారు. నిరుటితో పోలిస్తే ఈసారి బీఈ/బీటెక్ తరగతులు 15 రోజులు ముందుగా ప్రారంభం కానున్నాయి. ఏటా ఆగస్టు 15న తరగతులు ప్రారంభమవుతుండగా, ఈసారి ఆగస్టు 1న ప్రారంభించనున్నామని ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిష్టారెడ్డి తెలిపారు. రెండు, మూడు విడతల కౌన్సెలింగ్‌లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రతిసారి ఆప్షన్ల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు మొదటి విడతలో చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోబోమని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన స్పష్టం చేశారు.