Share News

దరఖాస్తు గడువు ముగియక ముందేమేనేజ్‌మెంట్‌ సీట్లు గాయబ్‌!

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:44 AM

హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల దందా జోరుగా నడుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు అన్ని కళాశాలల్లో ....

దరఖాస్తు గడువు ముగియక ముందేమేనేజ్‌మెంట్‌ సీట్లు గాయబ్‌!

  • బీ కేటగిరీ సీట్లలో కాలేజీల ఇష్టారాజ్యం.. రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డొనేషన్లు

హైదరాబాద్‌ సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల దందా జోరుగా నడుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు అన్ని కళాశాలల్లో బి-కేటగిరీ కోటా హౌస్‌ఫుల్‌ అని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దరఖాస్తు గడువు ముగియకముందే సీట్లను అమ్మేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఈ నెల 15వరకు గడువు ఉంది. నోటిఫికేషన్‌ ఇచ్చిన నాటినుంచి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం వారంపాటు సమయం ఉంటుంది. ఈ లెక్కన జూలై 1న నోటిఫికేషన్‌ ఇచ్చిన కాలేజీలైనా మంగళవారం వరకు దరఖాస్తులు స్వీకరించాలి. కానీ వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. కొన్ని టైర్‌1 కళాశాలలు పేపర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ.. దరఖాస్తు చేసుకునే లింక్‌ను మాత్రం డీయాక్టివేట్‌ చేశాయని గచ్చిబౌలికి చెందిన ఒక విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం నోటిఫికేషన్‌ ఇవ్వక మునుపే సీట్లను అమ్ముకోవడమేనంటున్నారు. బాచుపల్లి, నిజాంపేట్‌, గండిపేట, మొయినాబాద్‌, శంషాబాద్‌, ఇబ్రహీంపట్నం, ఉప్పల్‌, నాగోలు, కీసర ఘటకేసర్‌ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉందని బి. కేటగిరీ సీట్ల కోసం ఆయా కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ ప్రాంతాల్లోని టైర్‌2 కాలేజీల్లో కొన్ని అసలు ప్రకటనలు ఇవ్వకుండానే సీట్లు అమ్ముకున్నాయని ఆయా ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు విద్యాశాఖ ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ యూనివర్సిటీల నుంచి గుర్తింపు కలిగిన కళాశాలల్లో 70శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలోనూ, 30శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ (బి-కేటగిరీ) కోటాలోనూ భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కలిపి మొత్తం 1.25లక్షల సీట్లు ఉండగా, ఇందులో 88వేల(70శాతం) సీట్లు ఎప్‌సెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు కన్వీనర్‌ కోటా కింద కేటాయిస్తారు. మిగిలిన 30శాతం సుమారు 37వేల సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటా కింద మెరిట్‌ ప్రాతిపదికన కేటాయించాల్సి ఉంది. అయితే, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు వారి నివాసాలకు సమీపంలోని కాలేజీలకు వెళ్లి మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల గురించి వాకబు చేయగా, టైర్‌1 కాలేజీల్లో సీట్లన్నీ నెల కిందటే రూ.8లక్షల నుంచి 20లక్షలవరకు అమ్ముడు పోయాయని జవాబు వినిపిస్తోంది. టైర్‌2 కాలేజీల్లోనైతే రూ. 5లక్షల నుంచి 8లక్షలవరకు డొనేషన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.


మెకానికల్‌, సివిల్‌కు డిమాండ్‌

గతంలో కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు హాట్‌కేకుల్లా అమ్ముడు పోగా, ఈసీఈ, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌.. తదితర కోర్‌ బ్రాంచ్‌ సీట్లు మిగిలిపోయేవి. ఈ ఏడాది అందుకు భిన్నంగా మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్‌ సీట్లు మాత్రం లేవని యాజమాన్యాలు చెబుతున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లయితే, కొంత డొనేషన్‌ తక్కువైనా ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి. కొన్ని కళాశాలలైతే కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌ సీట్లకు తీసుకునే డొనేషన్‌ స్థాయిలో...ఈసీఈ, మెకానికల్‌ ఇంజరింగ్‌ సీట్లకు డొనేషన్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ దరఖాస్తు ప్రక్రియ నుంచి మెరిట్‌ ప్రాతిపదికన సీట్ల భర్తీవరకు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల దందా జోరుగా సాగుతున్నా, ప్రభుత్వం వైపు నుంచి సరైన పర్యవేక్షణ కొరవడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 07 , 2026 | 04:44 AM