kumaram bheem asifabad-అంతులేని వ్యథ
ABN , Publish Date - Aug 18 , 2026 | 10:44 PM
జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ పెద్దవాగుపై నిర్మిం చిన కుమరం భీం ప్రాజెక్టుపై అధికారుల నిర్లక్ష్యం రైతులకు అంతులేని వ్యథగా మారింది. ప్రాజెక్టు ప్రారంభించి పుష్కర కాలం దాటినా నేటికి పంట లకు నీరందక పోవడంతో ఆయకట్టుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- పుష్కర కాలం పూర్తయినా అందని సాగునీరు
- అధ్వానంగా ప్రాజెక్టు కాలువలు
- ఆనకట్ట పగుళ్లుబారినా మరమ్మతులు కరువు
- ఆందోళనలో ఆయకట్టుదారులు
ఆసిఫాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ పెద్దవాగుపై నిర్మిం చిన కుమరం భీం ప్రాజెక్టుపై అధికారుల నిర్లక్ష్యం రైతులకు అంతులేని వ్యథగా మారింది. ప్రాజెక్టు ప్రారంభించి పుష్కర కాలం దాటినా నేటికి పంట లకు నీరందక పోవడంతో ఆయకట్టుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2005లో 10 టీఎంసీల సామర్థ్యంతో 45వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ. 450 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రధాన కాలువలు పూర్తయిన వర్షాలకు పడిన గండ్లకు మరమ్మతులు చేయకపోవడంతో చుక్కనీరు పంటలకు అందడం లేదు.. రైతులు కాలువలలో నిలువ ఉన్న నీటిని, సమీపంలోని వాగుల నుంచి అయిల్ ఇంజన్‌ల ద్వారా పంటలకు నీటిని అందించుకుంటూ అవస్థలు పడాల్సి వస్తోంది. కాగా నాలుగేళ్లు క్రితం కురిసిన బారీ వర్షాలకు ప్రాజెక్టు అనకట్ట దెబ్బతిని బలహీనంగా మారింది. నీటి తాకిడికి కుంగి పోయింది. అనకట్ట కుంగి నాలుగేళ్లు గడుస్తున్నా అధికారులు మరమ్మతులు చేపట్టకుండా కట్టపై పాలిథీన్ కవర్లు కప్పించారు. ప్రాజెక్టు ఆనకట్ట కుంగడంతో నీటి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీటిని అధికారులు నిలువ చేయడం లేదు.
- అధ్వానంగా కాలువలు..
ప్రాజెక్టు ప్రధాన కాలువలు అధ్వానంగా మారాయి. వాంకిడి మండలం మీదుగా వెళ్లే ఎడమ కాలువ 65 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. నవేగూడ, ఇంధాని, ఖిరిడి, సరండి, వాంకిడి, ఖమా న, జంబుల్‌దరి, లక్ష్మిపూర్, వెల్గి, ఖేడెగాం, ఖనర్‌గాం గ్రామాల మీదుగా ఆసిఫాబాద్ మండలం భీంపూర్, గుండి, తదితర గ్రామాలతో పాటు కాగజ్‌నగర్ మండలంలోని పలు వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు అందించాల్సి ఉంది. జిల్లాలో గతంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువ చిన్న వాంకిడి వద్ద గండి పడింది. కేవలం మట్టితో చదును చేసి అలాగే వదిలి వేయడంతో నీటిని విడుదల చేయడం లేదు. మోకాసిగూడ నుంచి వాంకిడి వరకు కాలువ అనేక చోట్ల సిమెంట్ లైనింగ్ కూలిపోయింది. కాలువల్లో పిచ్చి మొక్కలు, చెత్తచెదారం, పూడిక పెరుకు పోయి అధ్వానంగా మారాయి. కుడి కాలువ నిర్మాణం పూర్తయి ఆరేళ్లు గడిచినా అరంభంలోనే కూలిపోవడంతో ఇందులో సైతం నీటిని వదలడంలేదు. మానిక్‌గూడ గ్రామ సమీపంలో కుడి కాలువ కోతకు గురవుతోంది. దీంతో ఆయకట్టుదారులకు నీరందక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
- నిర్వహణ అస్తవ్యస్తం..
ప్రాజెక్టు నిర్వహణను అధికారులు పట్టించుకోక పోవడంతో అస్తవ్యస్తంగా మారింది. 2022 జూలై లో కురిసిన భారీ వర్షాలకు ఆనకట్ట దెబ్బతింది. నిర్మాణ సంస్థ ప్రాజెక్టు పనులను నాసిరకంగా చేపట్టడంతో బారీ వర్షాలకు అనకట్ట కుంగి బీటలు వారింది. వరద ఉధృతికి కుడివైపు చివరి భాగంలో 300 మీటర్ల మేర దెబ్బతిని రాళ్లు, మట్టి కొట్టుకు పోయి బలహీనంగా మారింది. నీటి తాకిడికి ఆనక ట్ట కుంగిపోయింది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు పాలిథిన్ కవర్లు కప్పారు. నాలుగేళ్లు గడుస్తున్నా మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
- పది టీఎంసీల నిలువ..
కుమరం భీం ప్రాజెక్టును 10 టీఎంసీల నిలువ సామర్థ్యంతో నిర్మించారు. కానీ అనకట్ట దెబ్బతిన డంతో 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీటిని నిలువ చేయడంలేదు. వరదనీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతున్న గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతు న్నారు. ఆసిఫాబాద్ మండలంలో కుడి కాలువ ద్వారా ఆరు వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 39వేల ఎకరాలు ఆసిఫాబాద్ మండలంతో పాటు వాంకిడి, కాగజ్‌నగర్ మండలాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రాజెక్టు నిలువ సామర్థ్యం తగ్గించడం, కాలువలు అధ్వానంగా మారడంతో పం ట పొలాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. ప్రాజెక్టులోని నీరు ప్రస్తుతం మిషన్ భగీరథ నీటి సరఫరా, చేపల పెంపకం కోసం మాత్రమే ఉపయో గపడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.