kumaram bheem asifabad- తీరని వ్యథ
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:06 PM
అడవులు, కొండల మధ్య సహవాసం చేస్తున్న కొలాం ఆదివాసీలు కనీస మౌలిక సదుపాయాలు నోచుకోక అవస్థలు పడుతున్నారు. మండలంలోని గూడ మామడా గ్రామ పంచాయతీ పరిధిలో కొలాం గూడలో 39 ఇళ్లు ఉన్నాయి. ఇందులో సుమారు 150 మంది సహవాసం చేస్తున్నారు. గిరిజనులు గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
- తాగునీటికి ప్రజల అవస్థలు
- పట్టించుకోని అధికారులు
జైనూర్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అడవులు, కొండల మధ్య సహవాసం చేస్తున్న కొలాం ఆదివాసీలు కనీస మౌలిక సదుపాయాలు నోచుకోక అవస్థలు పడుతున్నారు. మండలంలోని గూడ మామడా గ్రామ పంచాయతీ పరిధిలో కొలాం గూడలో 39 ఇళ్లు ఉన్నాయి. ఇందులో సుమారు 150 మంది సహవాసం చేస్తున్నారు. గిరిజనులు గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. లోయలో దిగుతూ, కొండను ఎక్కుతూ అతి కష్టం మీద నీటిని తెచ్చుకుంటున్నారు. గ్రామంలో ఎప్పుడో నిర్మించిన బోరు బావిలో నీరు రాకపోడంతో తాగునీటి కోసం వారు ఇబ్బందులు పడుతున్నారు.
- సాగని ఇళ్ల పనులు..
నీటి కొరత మూలంగా పీఎం జుగా పథకం కింద మంజురైన ఇళ్ల పనులు పునాది స్థాయిలోనే ఉండిపోయాయి. గ్రామానికి 18 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. కానీ ఇళ్ల పనులు చేపట్టేందుకు సరిపడా నీరు లేక పోవడంతో పనులు నిలిచిపో యాయి. వారికున్న ఒకే ఒక బోరు బావిలో కేవలం గంట పాటు మాత్రమే పని చేస్తున్నదని, ఆ తర్వాత నీరు రావడం నిలిచి పోతుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు సుమారు ఆరేళ్ల క్రితం నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంక్ అలంకారప్రాయంగా మారింది. పక్కనే ఉన్న హనుమాన్‌గూడకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతుండగా తమ గ్రామానికి మిషన్ భగీరథ నీరు ఊసే లేదని ప్రజలు చెబుతున్నారు. పలుమార్లు అధికారులకు చెప్పినా నిరాశ తప్ప మిగిలిందేమి లేదని, తమ గోడును అధికారులు పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు. గ్రామంలో ఉన్న ఐటీడీఎ పాఠశాలను ఎత్తి వేసి పక్కనే ఉన్న హనుమాన్‌గూడకు మార్చేశారని వాపోతున్నారు. అంగన్ వాడీ కేంద్రం ఉన్నప్పటికీ పోషక ఆహరం పంపీణి అంతంత మాత్రంగా ఉందని చెబుతు న్నారు. గ్రామంలో సమారు 12 మంది యువతీ, యువకులు ఇంటర్, డిగ్రీ చదివారు. ఉపాధి కోసం ఇతర గ్రామాలకు వెళ్ళి కూలి నాలి చేస్తున్నారని వారికి కనీస ఉద్యోగాలు లేవని, విద్యావంతులు ఉపాధి ఆవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. కాగా ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు దిగుబడి రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని చెబుతున్నారు. ఉపాధి హామీ లాంటి పనులు అమలు చేయాలని కోరుతున్నారు. గ్రామం లో సరైన రోడ్లు సైతం నిర్మించలేదు. దీంతో వర్షాకా లంలో బురదమయంగా మారిన రోడ్లపై నడకకు సైతం అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గ్రామంలో నిర్మించిన చిన్న నీటటి ట్యాక్‌కు పగుళ్లు రావడంతో నీరు నిలువ ఉండడం లేదని, మిషన్ భగీరథ నీటి ట్యాంక్ ద్వారా నీటీ సరఫరా అయ్యేలా అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు. సరైన వైద్య సదుపాయం కూడా లేదని చెబుతున్నారు.
మిషన్ భగీరథ నీరు అందించాలి
సిడాం ముత్త, గ్రామపటేల్
గ్రామంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలి. మాకు అరకిలో మీటర్ల దూరంలో ఉన్న హనుమాన్‌గూడ వాసులకు మిషన్ భగీరథ నీరు వస్తుంది. మా గ్రామానికి నీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.
సమస్యలు పరిష్కరించాలి..
సిడాం గంగారాం, దేవారి
గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరించాలి. సీజనల్ వ్యాధులతో ఏటా ఇబ్బందు లు పడుతున్నాం. సంబంధిత అధికారులు రాకపోవ డంతో వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. గ్రామంలో కనీసం ఆశా వర్కర్‌ను నియ మించాలి.