kumaram bheem asifabad- పల్లెల్లో చెక్‌పవర్ రగడకు చెక్
ABN , Publish Date - Oct 04 , 2026 | 10:32 PM
పల్లెల్లో ఒకే పార్టీకి చెందిన సర్పంచ్, ఉపస్పంచ్‌లు లేని గ్రామపంచాయతీల్లో ఏర్పడిన ఇబ్బందులను ప్రభు త్వం తొలగించింది. రాజకీయ కోణంలో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై చట్టసవరణ ద్వారా ప్రభుత్వం ఆ అడ్డంకులను తొలగించింది.
- ఇబ్బంది పెడితే కలెక్టర్లు చర్యలు తీసుకునేలా ఆదేశాలు
- అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉత్తర్వులు జారీ
వాంకిడి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో ఒకే పార్టీకి చెందిన సర్పంచ్, ఉపస్పంచ్‌లు లేని గ్రామపంచాయతీల్లో ఏర్పడిన ఇబ్బందులను ప్రభు త్వం తొలగించింది. రాజకీయ కోణంలో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై చట్టసవరణ ద్వారా ప్రభుత్వం ఆ అడ్డంకులను తొలగించింది. సంతకంతో ఉన్న పవర్‌తో ఉప సర్పంచ్‌లు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని భావించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఉపాధి కల్పన శాఖ, కమిషనర్ ఉత్తర్వులను జారీ చేసింది. తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లింపులో చెక్కులపై సర్పంచ్, ఉప సర్పంచ్‌కు సంతకం చేసే అధికారం ఉంది.
- పనులు ముగిసినా..
అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంత మంది ఉప సర్పంచ్‌లు పనులు ముగిసినా సంతకాలు చేయకుండా నెలల తరబడి పెండింగ్ పెడుతున్న విషయం ప్రభు త్వం దృష్టికి వచ్చింది. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య ఉన్న విభేదాల కారణంగా గ్రామీణాభివృద్ధి పనులు నిలిచిపోకుండా ఉండేందు కు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేర్వేరు రాజకీ య పార్టీలకు చెందడం లేదా వ్యక్తిగత విభేదాల కారణంగా పలు పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లు, బిల్లులపై సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొన్ని చొట్ల సంతకం పెట్టడానికి ప్రతిఫలాలు ఆశిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో గ్రామాల్లో అత్యవసర అభివృద్ధి పనులు స్తంభించిపోయాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సర్పంచులకు పెద్ద ఊరట లభించినట్లయింది.
- కొత్త నిబంధనల ప్రకారం..
కొత్త నిబంధనల ప్రకారం, సర్పంచ్ లేదా పంచాయతీ సిబ్బంది చెక్కును సమర్పించిన నాటి నుంచి ఏడు పనిదినాల్లోగా ఉప సర్పంచ్ సంతకం చేయాల్సి ఉంటుంది. లేదా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఆమోదం తెలపాలి. తగిన కారణం లేకుడా గడువు దాటితే కలెక్టర్ తక్షణమే విచారణ చేపడతారు. విచారణలో ఉపసర్పంచ్ ఉద్దేశపూర్వకంగా చెల్లింపు లను అడ్డుకున్నట్లు తేలితే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. సదరు ఉప సర్పంచ్ జాయింట్ చెక్‌పవర్ అధికారాన్ని రద్దు చేసి ఆ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, లేదా ఎంపీవోకి అప్పగించే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు నిఽధులు రాక, మరోవైపు స్థానిక రాజకీయాలతో బిల్లు లు చెల్లించక సర్పంచ్‌లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నూతన సంస్కరణతో బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెరిగి, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని భావిస్తున్నారు.