నూనెగింజల సాగుకు ప్రోత్సాహం
ABN , Publish Date - Nov 14 , 2026 | 02:01 AM
వంట నూనెల దిగుమతులను తగ్గించేందుకు దేశీయంగానే నూనె ఉత్పత్తులు పెంచాలని కేంద్రం భావిస్తున్నది. ఇందుకోసం నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని పెంచి ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించాలని నిర్ణయించింది. జాతీయ ఆహార నూనెల మిషన్-నూనె గింజల పథకం కింద రైతులకు ఉచితంగా, సబ్సిడీపై నూనె గింజల విత్తనాల పంపిణీ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
వంట నూనెల దిగుమతులను తగ్గించేందుకు దేశీయంగానే నూనె ఉత్పత్తులు పెంచాలని కేంద్రం భావిస్తున్నది. ఇందుకోసం నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని పెంచి ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించాలని నిర్ణయించింది. జాతీయ ఆహార నూనెల మిషన్-నూనె గింజల పథకం కింద రైతులకు ఉచితంగా, సబ్సిడీపై నూనె గింజల విత్తనాల పంపిణీ చేపట్టింది. ఈ పథకం కింద జిల్లాలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ పంటలను సాగు చేసేలా చూసేందుకు ప్రణాళిక రూపొందించారు. వేయి ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 50 ఎకరాల్లో కుసుమ, 160 ఎకరాల్లో వేరుశనగ పంటలను వేయించి నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. 50శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను, పొద్దుతిరుగుడు, కుసుమ విత్తనాలను ఉచితంగానే అందజేయాలని తలపెట్టింది. జిల్లాకు 120 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 25 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు విత్తనాలు, 2 క్వింటాళ్ళ కుసుమ విత్తనాలను సేకరించింది. సైదాపూర్ మండలంలోని 271 మంది రైతులకు 50శాతం సబ్సిడీపై 120 క్వింటాళ్ళ వేరుశనగ విత్తనాలను సరఫరా చేశారు. 20 కేజీల బ్యాగ్ ధర 2,500 ఉండగా 1250 రూపాయలకే రైతులకు వాటిని అందించారు. ఈ పంటకు అవసరమయ్యే నీమ్ ఆయిల్‌ను కూడా 70శాతం సబ్సిడీపై వ్యవసాయశాఖ ఆయా రైతు లకు అందజేయనున్నది. గన్నేరువరం, చొప్పదండి, చిగురుమామిడి, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో వేయి ఎకరాల్లో పొద్దుతిరుగుడు సాగు ప్రోత్సాహించాలని నిర్ణయించారు. 100శాతం సబ్సిడీపై 25 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు ఉచితంగా అందజేస్తారు. 4 కేజీల విత్తనాల బ్యాగ్ ధర 474 రూపాయలు ఉండగా రైతులకు వీటిని ఉచి తంగానే ఇస్తున్నారు. అయితే పొద్దుతిరుగుడు సాగుకు రైతులు ముందుకు రాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హుజురాబాద్, జమ్మికుంట, సైదాపూర్ మండలాల్లో 50 ఎకరాల్లో కుసుమ పంటను సాగు చేసేందుకు 2క్వింటాళ్ల విత్తనాలను 100శాతం సబ్సిడీపై సరఫరా చేయడానికి నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో రైతులు ఈసాగుకు ముందుకు రావ డంతో కేజీ విత్తనాలకు 420 ధర ఉండగా వాటిని రైతులకు ఉచితంగా సమకూర్చారు. ప్రధానంగా పక్కపక్కన ఉన్న రైతులను గుర్తించి సమహంగా ఒకేచోట నూనెగింజల సాగును చేపడితే బాగుంటుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా సాగు చేయడం ద్వారా రైతులు కలిసి పనిచేసుకోవడంతో పాటు సాగు విధానాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని, ఉత్పత్తులను కూడా సమష్టిగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశముం టుందని అధికారులు చెపుతున్నారు.
మట్టి నమూనాల సేకరణ
ఎంపిక చేసిన రైతుల భూముల నుంచి మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు కూడా నిర్వహిస్తారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధారుకార్డు జిరాక్సులతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి, వ్యవసాయ సహకార సంఘంలో కానీ వాటిని అందజేయాల్సి ఉంటుంది. పొద్దుతిరుగుడు సాగు చేయడానికి ఆసక్తి ఉన్న రైతులు నిర్ణయించిన మండలాలకు చెందినవారు ఆయా ప్రాంతాల వ్యవసాయశాఖ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.