Empowering Divyangs Through Savings: దివ్యాంగుల పొదుపు బాట!
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:04 AM
రాష్ట్రంలోని దివ్యాంగులు తమ శారీరక వైకల్యాన్ని అధిగమించి మనోధైర్యంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ముందడుగు వేస్తున్నారు.
మహిళా పొదుపు సంఘాల్లో సభ్యత్వాలు.. బ్యాంకు లింకేజీతో స్వయం ఉపాధికి అడుగులు
రాష్ట్రంలో ఇప్పటికే 11 వేల సంఘాలు
ప్రతి సంఘంలో 5 నుంచి 15 మంది
మరో 7వేల సంఘాల ఏర్పాటుపై దృష్టి
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దివ్యాంగులు తమ శారీరక వైకల్యాన్ని అధిగమించి మనోధైర్యంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) స్ఫూర్తితో ‘పొదుపు’ పట్టారు. కేవలం ప్రభుత్వ పింఛన్లపైనే ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడాలనే పట్టుదలతో పొదుపు సంఘాలుగా ఏర్పడుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తూ.. పరుల సానుభూతి చూపుల దుస్థితి నుంచి.. భేష్ అనే ప్రశంసల స్థాయికి చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.05 లక్షల మందికిపైగా పింఛను పొందుతున్న దివ్యాంగులుండగా.. వారిని ఒక తాటిపైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గతంలో అత్యవసరాల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోయిన దివ్యాంగులకు ఈ పొదుపు సంఘాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. 5 నుంచి 15 మంది సభ్యులతో ఏర్పడుతున్న ఈ గ్రూపులు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ అవసరమైనప్పుడు తమలో తామే రుణాలు ఇచ్చుకుంటారు. దీనికి తోడు సెర్ప్ అధికారులు వీరికి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నారు.
సంఘాలే.. స్వయం సహాయకాలై..
ఇప్పటి వరకు వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 18 వేల సంఘాలను లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 11 వేల పొదుపు సంఘాలు కొలువు దీరాయి. మరో 7వేల సంఘాల ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంఘాలు అత్యవసర వైద్య ఖర్చులు, ఇంటి అవసరాల కోసం అడ్డగోలు వడ్డీలకు అప్పులు తెచ్చుకునే దుస్థితి నుంచి దివ్యాంగులను కాపాడుతాయి. తమ పొదుపు నిధులనే అత్యల్ప వడ్డీకి వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. కేవలం పొదుపుకే పరిమితం కాకుండా బ్యాంకు రుణాల ద్వారా కిరాణా షాపులు, మిల్క్ డెయిరీలు, పచ్చళ్లు, అగర్‌బత్తీల తయారీ వంటి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం వీరిని ప్రోత్సహిస్తోంది. ఒకే రకమైన సమస్యలున్న వారు ఒక చోట చేరడం వల్ల కష్టసుఖాలు పంచుకోవడమే కాకుండా సామాజికంగా తాము ఎవరికి తక్కువ కాదనే ఆత్మగౌరవం వారిలో పెరుగుతోంది. ఇన్నాళ్లూ కేవలం చేయూత కోసం చూసిన కళ్లు ఇప్పుడు చేయూతనిచ్చే స్థాయికి చేరుతుండటం సామాజిక మార్పునకు సంకేతంగా మారుతోంది.
నాగర్‌కర్నూల్ జిల్లా టాప్
దివ్యాంగుల సంఘాల ఏర్పాటులో నాగర్‌కర్నూల్ జిల్లా 534 సంఘాలతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలిచింది. దీని వెంటే నల్గొండ (522), రంగారెడ్డి (504) జిల్లాలు నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులు ఈ సంఘాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సుమారు 50 వేల మంది దివ్యాంగులు మహిళా సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతుండగా.. ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పడుతున్న ఈ సంఘాలు వారిలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.