Share News

‘ఉపాధి’కి బ్రేక్‌

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:10 AM

ఒకవైపు ఎలినినో ప్రభావం.. మరోవైపు వికసిత్‌ భారత్‌ అజివిక గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ గ్రామీణ్‌ పథకం (వీబీజీరామ్‌జీ) సిబ్బంది సమ్మెకు దిగడంతో గ్రామాల్లో కూలీలకు పనులు దొరకక అల్లాడుతున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు మినహా టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఈసీలు, ఏపీఓలు గత రెండు వారాలుగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని

‘ఉపాధి’కి బ్రేక్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఒకవైపు ఎలినినో ప్రభావం.. మరోవైపు వికసిత్‌ భారత్‌ అజివిక గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ గ్రామీణ్‌ పథకం (వీబీజీరామ్‌జీ) సిబ్బంది సమ్మెకు దిగడంతో గ్రామాల్లో కూలీలకు పనులు దొరకక అల్లాడుతున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు మినహా టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఈసీలు, ఏపీఓలు గత రెండు వారాలుగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విధులు బహ్కిరించి సమ్మె చేస్తుండడంతో వీబీజీరామ్‌జీ పథకం పనులు నిలిచి పోయాయి. ఎలినినో ప్రభావం వల్ల జిల్లాలో ఆశించిన మేరకు వర్షాలు పడక పోవడంతో భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు వ్యవసాయ కూలీలు, ఇతర కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉండేందుకు వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు జలసిరి పనులను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాలో 46 వేల ఇంకుడు గుంతలు, 1,144 పంట కుంటలు, 230 ఊటకుంటలు, 230 బోర్‌వెల్స్‌ రీచార్జీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌ సహ సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సిబ్బందిని పురమాయించారు. జిల్లాలో రోజుకు కూలీ పనులకు వచ్చే కూలీల సంఖ్య 5 వేలకు మించడం లేదు. ప్రతి రోజు ఒక్కో గ్రామంలో 60 మంది కూలీలకు తగ్గకుండా 15,780 మంది కూలీలు పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని గత నెలాఖరులో ఆదేశించారు. అయితే అదే నెల 27వ తేదీ నుంచి వీబీజీ రామ్‌జీ సిబ్బంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు మినహా ఏపీఓలు, ఈసీలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, మొత్తం 68 మంది తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేపడుతున్నారు. దీంతో జిల్లాలో ఉపాఽధి కూలీలకు ఉపాధి పనులు కల్పించలేక పోతున్నారు.

ఫ ఫీల్డ్‌ అసిస్టెంట్లు విధుల్లో ఉన్నా కల్పించని పనులు

ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మెకు దూరంగా ఉన్నప్పటికీ గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించలేక పోతున్నారు. సమ్మెలో కంప్యూటర్‌ ఆపరేటర్లు కొనసాగుతుండడంతో వర్క్‌ డిమాండ్‌ కల్పించనిదే పనులు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ పనులు కల్పించినా కూడా కూలీలకు వేతనాలు రావు. వర్క్‌ డిమాండ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ కల్పించాల్సి ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ఆపరేటర్లు సమ్మెలో ఉండడంతో పాస్‌వర్డ్‌, యూజర్‌ ఐడీలు మార్చడంతో గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనులు కల్పించలేని పరిస్థితి నె లకొన్నది. జిల్లాలో లక్షా 18 వేల జాబ్‌ కార్డులు ఉండగా, వీటిపై 2 లక్షల 38 వేల మంది కూలీలు నమోదై ఉన్నారు. వీబీజీరామ్‌జీ పథకం గత నెల ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆ నెలలో కూలీలకు 90 వేల పని దినాలు కల్పించారు. 2 కోట్ల 37 లక్షల 81 వేల రూపాయల వేతనాలను కూలీలకు చెల్లించాల్సి ఉంది. వీబీజీరామ్‌జీ సిబ్బంది సమ్మెలో ఉన్న కారణంగా ఉపాధి పనులు నిలిచి పోయాయి.

ఫ ఉద్యోగులతో చర్చలు జరపాలి

సెర్ఫ్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమ ఉద్యోగ భద్రత కల్పిస్తామని గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందని వీబీజీరామ్‌జీ ఉద్యోగులు చెబుతున్నారు. సెర్ఫ్‌ సిబ్బంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించినప్పటికీ వీళ్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరించలేక పోయారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, గ్రామాల అభివృద్ధికి దోహదపడే అత్యంత కీలక పథకమైన వీబీజీ రామ్‌జీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది. ఇరవై ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఎన్నోసార్లు ఆయా ప్రభుత్వాలకు వీబీజీరామ్‌జీ ఉద్యోగులు మొర పెట్టుకున్నా కూడా వాళ్ల సమస్యలు పరిష్కారం కాలేదు. ఉద్యోగ భద్రత కల్పించక పోయినా కనీసం పేస్కేల్‌ అయినా ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. వర్షాలు లేక వ్యవసాయ పనులు ముందుకు సాగక కూలీలకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉద్యోగులతో చర్చలు జరిపి వాళ్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు సూచిస్తున్నారు.

Updated Date - Aug 13 , 2026 | 01:10 AM