Share News

ప్రభుత్వంపై ఉద్యోగుల సమరభేరి

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:58 AM

తమ సమస్యల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు సమరభేరి మోగిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన కమిటీ నేతృత్వంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నాను నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో 30వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఉండగా సుమారు మూడు వేల మంది ఉద్యోగులు,

ప్రభుత్వంపై ఉద్యోగుల సమరభేరి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తమ సమస్యల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు సమరభేరి మోగిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన కమిటీ నేతృత్వంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నాను నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాలో 30వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఉండగా సుమారు మూడు వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ధర్నాకు హాజరవుతారని భావిస్తున్నారు. జేఏసీ చైర్మన, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, జేఏసీ కన్వీనర్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు మడిపల్లి కాళీచరణ్‌గౌడ్‌ ఈ మహాధర్నాకు నాయకత్వం వహిస్తున్నారు.

ఫ ఉద్యోగుల డిమాండ్లు

రెండో పీఆర్సీని 2023 జూలై 1 నుంచి వర్తించేలా తక్షణమే అమలు చేయాలని, ఆరు డీఎలను, డీఆర్‌లను వెంటనే విడుదల చేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన (సీపీఎస్‌)ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తూ ప్రతీనెల రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతున్నారు. నూతనంగా ప్రకటించిన ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ సక్రమంగా అమలు చేయాలంటున్నారు. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లను చెల్లించకుండా జాప్యం చేస్తూ ఇబ్బందులపాలు చేస్తున్నారని, ఎలాంటి జాప్యం లేకుండా వాటిని చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొత్త హెల్త్‌ స్కీమ్‌లో ఉన్న లోపాలను సవరించి తమకు, తమ కుటుంబసభ్యులకు మెరుగైన వైద్య సేవలందించాలని, ఇప్పటి వరకు లోపభూయిష్టంగా ఉన్న హెల్త్‌ స్కీమ్‌ కారణంగా పడుతున్న ఇబ్బందులను తొలగించాలని వారు కోరుతున్నారు. సెప్టెంబరు 1న పెన్షన విద్రోహ దినంగా పాటించాలని ఉద్యోగులు నిర్ణయించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన విధానం కారణంగా ఉద్యోగ విరమణ పొందిన వారికి నామమాత్రపు పెన్షన లభిస్తుందని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన స్కీమ్‌ను పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎంతో కాలంగా ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినా పరిష్కారానికి నోచుకోని కారణంగా ఉద్యోగులు ఆందోళనబాట పట్టాలని నిర్ణయించుకొని జేఏసీగా ఏర్పడి మహాధర్నాతో తమ పోరాటానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

ఫ హక్కుల సాధన కోసమే మా పోరాటం

- దారం శ్రీనివాస్‌రెడ్డి, టీఎనజీవోస్‌ జిల్లా అధ్యక్షుడు, ఈజేఏసీ చైర్మన

ప్రభుత్వాన్ని మేము గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదు... ఉచితాలు, దాన ధర్మాలు అడుగడం లేదు.. రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన హక్కులను అమలు చేయాలని కోరుతున్నాము... ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం ఐదు సంవత్సరాల కొకసారి పీఆర్సీ, ఆరు నెలలకొకసారి డీఏ, ఏడాదికి ఒకసారి ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడేళ్ళుగా పీఆర్సీ అమలు చేయలేదు. ఆరు డీఏలను పెండింగ్‌లో పెట్టింది. సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ అమలు చేయాలని, మా డిమాండ్లను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. ప్రభుత్వం స్పందించక పోవడంతో తప్పనిసరి పరిస్థితిలో జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలకు శ్రీకారం చుట్టాము. కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించే మహాధర్నాలో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులంతా పాల్గొని ఐక్యతను చాటాలి.

ఫ సమస్యలను పరిష్కరిస్తుందనే వేచిచూశాం

- మడిపల్లి కాళీచరణ్‌గౌడ్‌, జేఏసీ కన్వీనర్‌

దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని వేచి చూశాం. ఇప్పటి వరకు వాటిని పరిష్కరించక పోవడంతోనే మహాధర్నా చేపట్టాల్సి వచ్చింది. ప్రధాన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం చేస్తాము.

Updated Date - Aug 27 , 2026 | 12:58 AM