Share News

నేడు ఉద్యోగుల జేఏసీ మహాధర్నా

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:19 AM

ఉద్యోగులు, పింఛనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందంటూ ఉద్యోగుల జేఏసీ మహా ధర్నాకు పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని జేఏసీ ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌రావు బుధవారం ప్రకటించారు.

నేడు ఉద్యోగుల జేఏసీ మహాధర్నా

  • రెండో వేతన సవరణ, సీపీఎస్‌ రద్దు, పెండింగ్‌ బిల్లుల విడుదల సహా పలు డిమాండ్ల సాధనకు..

  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఇందిరాపార్క్‌ వద్ద నిరసన

  • రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ ధర్నాలు

  • సెప్టెంబరు1న సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన

  • 29న తెలంగాణ పవర్‌ జేఏసీతో చర్చలకు టీజీ ట్రాన్స్‌కో పిలుపు

హైదరాబాద్‌, ఆగస్టు26(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, పింఛనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందంటూ ఉద్యోగుల జేఏసీ మహా ధర్నాకు పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని జేఏసీ ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌రావు బుధవారం ప్రకటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ ఈ ధర్నా కొనసాగుతుందని వెల్లడించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రెండో వేతన సవరణ అమలు, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏల విడుదల, ఉద్యోగులు, పింఛనర్లకు సంబంధించి రూ.10 వేల కోట్ల పెండింగ్‌ బిల్లుల విడుదల, సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానం అమలు, కొత్త ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే తదితర డిమాండ్లతో మహా ధర్నా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనర్లు మహాధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. కాగా, సెప్టెంబరు 1న సీపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమం ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కమలాకర్‌, భూపతి రావు బుధవారం ప్రకటించారు.


సీపీఎస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 1న నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ పవర్‌ జేఏసీ గురువారం చేపట్టదలచిన మహాధర్నాను విరమించాలని, ఈనెల 29న చర్చలకు రావాలని టీజీ ట్రాన్స్‌కో పిలుపునిచ్చింది. ఈ మేరకు టీజీ ట్రాన్స్‌కో జాయింట్‌ సెక్రటరీ బిజ్జా గణేశ్‌రావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 29న విద్యుత్‌ సౌధలో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని, జేఏసీ చైర్మన్‌ ఈ సమావేశానికి తప్పక హాజరుకావాలని బిజ్జా గణేశ్‌రావు వెల్లడించారు.

Updated Date - Aug 27 , 2026 | 04:19 AM