Transfer Policies: ట్రాన్స్‌కో, జెన్‌కోలలో బది లీల లు
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:45 AM
సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో మూడేళ్లపాటు విద్యాశాఖలో అయితే మాత్రం 8 ఏళ్లు ఒకే చోట పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ అవుతారు.
ఖాళీలుంటేనే ట్రాన్స్‌కోలో.. 10 ఏళ్లు ఒకేచోట చేస్తేనే జెన్‌కోలో బదిలీలు
నిబంధనలు మార్చాలంటున్న ఉద్యోగులు
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో మూడేళ్లపాటు విద్యాశాఖలో అయితే మాత్రం 8 ఏళ్లు ఒకే చోట పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ అవుతారు. కానీ తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలలో బదిలీ మార్గదర్శకాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. విద్యుత్‌సౌధలో డీఈ నుంచి ఏఈ దాకా విధిగా 10 ఏళ్లు పనిచేస్తేనే బదిలీ చేస్తారు!. జనరేటింగ్ స్టేషన్లలో విధిగా 15 ఏళ్లు పనిచేయాలనే నిబంధన విధించారు. అంటే ఇది ఒక ఉద్యోగి లేదా అధికారి జీవితకాలంలో సగం సర్వీసుతో సమానం. ట్రాన్స్‌కోలో అయితే ఖాళీలుంటేనే ఆ ఖాళీలను భర్తీ చేయడానికి బదిలీలు చేస్తామనేలా నిబంధన విధించారు. ఇటువంటి నిబంధనలు విమర్శలకు తావిస్తున్నాయి. ఈ రెండు సంస్థలతో పోల్చితే ఉత్తర డిస్కమ్, దక్షిణ డిస్కమ్‌లు కనీసం మూడేళ్ల సర్వీసు ఉన్నవారికి స్థానచలనం కల్పించాయి. విద్యుత్‌సౌధ క్యాంటీన్‌లో టీ రూ.10, టిఫిన్ రూ.20, భోజనం రూ.30కి దొరుకుతుంది. అయినా, విద్యుత్ సౌధలో పనిచేస్తున్నవారందరికీ కార్పొరేట్ అలవెన్స్ వర్తింపజేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఏ అలవెన్స్‌ను వర్తింపజేయకపోవడం, విద్యుత్ సౌధలో ఉన్నవారిని అసలు కదిలించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మార్గదర్శకాలను సరిగా రూపొందించాలని ఉద్యోగులు కోరుతున్నారు.