kumaram bheem asifabad- ‘మీ ప్రమాణం’తో ఉద్యోగుల హాజరు
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:04 PM
ప్రభుత్వ ఉద్యోగుల హాజరు విషయంలో ఇక నుంచి నిబంధనలు మరితం కఠినం కానున్నాయి. విధులకు ఆలస్యంగా రావడం, గైర్హాజరైనా హాజరైనట్లు రిజిస్టర్ లో సంతకాలు చేయడం కొన్ని గంటలకే విధులు ముగించుకుని వెళ్లిపోవడం వంటి వాటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రమాణం యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
- ఇక రిజిస్టర్‌లో సంతకాలు పెట్టే పద్ధతికి స్వస్తి
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల హాజరు విషయంలో ఇక నుంచి నిబంధనలు మరితం కఠినం కానున్నాయి. విధులకు ఆలస్యంగా రావడం, గైర్హాజరైనా హాజరైనట్లు రిజిస్టర్ లో సంతకాలు చేయడం కొన్ని గంటలకే విధులు ముగించుకుని వెళ్లిపోవడం వంటి వాటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రమాణం యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఉద్యోగులు ఈ యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకోవలసి ఉంటుంది. జిల్లాలో యాప్ అమలును పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
- కలెక్టరేట్‌లో తొలిదశ..
జిల్లా కలెక్టరేట్‌లో తొలిదశగా ‘మీ ప్రమాణం’ యా ప్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియను ప్రారం భించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది యాప్ ద్వారానే హజరు నమోదు చేసుకుంటున్నారు. జిల్లాలో 70కి పైగా ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇందులో 45 శాఖ లు కలెక్టరేట్‌లో కొనసాగుతున్నాయి. మిగిలిన ప్రభుత్వ శాఖల కార్యాలయాలు పట్టణంలోని వివిధ ప్రాంతా ల్లో ఉన్నాయి. కాగా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు జిల్లా కేంద్రానికి ఆలస్యంగా వస్తున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగుల హజరు రిజిష్టర్‌లో సంతకాలు చేసి విధులకు హాజరైనట్లు నమోదు చేసుకునేవారు. ఈ విధానంలో సమయపాలనపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండడంతో కొత్త యాప్‌ను తీసుకువచ్చారు.
- ఆధార్, జీపీఎస్‌తో అనుసందానం:
రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఉద్యోగి ఎంప్లాయ్ ఐడీ, ఈ మెయిల్, ఆధార్ నంబర్‌తో పాటు కార్యాలయ జీపీఎస్ లోకేషన్ వివరాలను అనుసం ధానం చేస్తున్నారు. ప్రతిశాఖ అధిపతికి పూర్తయిన తర్వాత సంబంధిత శాఖలో యాప్ ద్వారా హాజరు నమోదు ప్రారంభమవుతుంది. ఉద్యోగులు తమ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని కార్యాల యాని కి వచ్చిన తర్వాత లాగిన్ కావాలి. అనంతరం యాప్ లో నిర్థేశించిన విధంగా ముఖగుర్తింపు ప్రక్రియలో భాగంగా కళ్లను మూసి తెరవడం చేయాలి. అప్పుడే హాజరు నమోదవుతుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలా హాజరు నమోదు చేయడం తప్పని సరి కానుంది. కార్యాలయ లోకేషన్ ఆధారంగా హాజ రు నమోదయ్యేలా వ్యవస్థను రూపొందించారు.
ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలి..
- కె హరిత, ఆసిఫాబాద్ కలెక్టర్
‘మీ ప్రమాణం’ యాప్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలి. ఈ మేరకు సంబందిత శాఖల అధికారులను ఆదేశించాం. ఉద్యో గులకు యాప్ పనితీరుపై అవగాహన కల్పించాలని, హాజరు నమోదును ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చాలని సూచించాం.