Share News

రేపటి నుంచి భానుడి భగభగ

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:46 AM

రాష్ట్రంలో వేసవి తీవ్రత మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

రేపటి నుంచి భానుడి భగభగ

  • రాష్ట్రమంతా 40 డిగ్రీలకు పైగానే..

  • కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో వేసవి తీవ్రత మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 12 నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ఈ నెల 22 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లా ఘనపూర్‌లో అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. తెలంగాణ వ్యాప్తంగా 27 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో పాటు మంచిర్యాల, కుమరం భీం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోటలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ధర్మపురి మండలం జైనాలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి) మండలంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఆకెనపల్లి, పెద్దపల్లి మండలం పాల్తెం, భోజన్నపేటలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన రైతు పులి సత్యనారాయణ(59) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన బరిగల శోభ(50) శుక్రవారం సీడ్‌ వరిలో బెరుకులు తీయడానికి వెళ్లి వడదెబ్బతో మృతి చెందింది.

Updated Date - Apr 11 , 2026 | 04:46 AM