Share News

బహిరంగ అంగట్లో అగ్గువకే కరెంట్‌

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:42 AM

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ ధరలు ఊహించని రీతిలో తగ్గుముఖం పట్టాయి. ఇండియన్‌ ఎనర్జీ ఎక్చేంజ్‌ (ఐఈఎక్స్‌)లో మంగళవారం నమోదైన గణాంకాల ప్రకారం...

బహిరంగ అంగట్లో అగ్గువకే కరెంట్‌

  • కనిష్ఠంగా 40 పైసలకే యూనిట్‌ విద్యుత్‌

  • 1636 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేసిన డిస్కంలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ ధరలు ఊహించని రీతిలో తగ్గుముఖం పట్టాయి. ఇండియన్‌ ఎనర్జీ ఎక్చేంజ్‌ (ఐఈఎక్స్‌)లో మంగళవారం నమోదైన గణాంకాల ప్రకారం, పగటిపూట విద్యుత్‌ ధరలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 1:15 గంటల మధ్య యూనిట్‌ విద్యుత్‌ కేవలం 40 పైసలకే విక్రయించారు. అదేవిధంగా ఉదయం 9 గంటల సమయంలో 79 పైసలుగా ఉన్న ధర, మధ్యాహ్నం రూపాయి లోపే అమ్ముడుపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా సౌర విద్యుత్‌ ఉత్పత్తి భారీగా పెరగడమే ఈ ధరల తగ్గుదలకు కారణమని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం ముందుగా కావడంతో అక్కడ సౌర విద్యుత్‌ విద్యుత్‌ ఉత్పత్తి ముందుగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా సోలార్‌ పవర్‌ తోడవ్వడంతో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.5లోపే లభిస్తోంది. అయితే సౌర విద్యుత్‌ అందుబాటులో లేని రాత్రి వేళల్లో మాత్రండిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ధరలు రూ.10వరకు పలుకుతున్నాయి. మరోవైపు తెలంగాణలో విద్యుత్‌ వినియోగం స్థిరంగా కొనసాగుతోంది. ఈనెల 13న 316 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరగ్గా, గరిష్ఠ డిమాండ్‌ 15,944 మెగావాట్లుగా నమోదైంది. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి తెలంగాణ డిస్కంలతో పాటు పారిశ్రామిక వినియోగదారులు ఓపెన్‌ మార్కెట్‌ నుంచి సుమారు 1636 మెగావాట్ల విద్యుత్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేశారు. పగటిపూట తక్కువ ధరకే విద్యుత్‌ లభిస్తుండడం డిస్కంలకు ఊరటనిచ్చే అంశం.

Updated Date - Apr 15 , 2026 | 04:42 AM