kumaram bheem asifabad- విద్యుత్ కనెక్షన్లు.. ఇక సులువు
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:26 PM
ఇన్నాళ్లు గృహ, వాణిజ్య, వ్యవసాయ ఇలా ఏ విద్యుత్ కనెక్షన్లు కావాలన్నా వ్యయ ప్రయాసలతో పాటు మంజూరు కావడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. ఫలితంగా నెలల తరబడి వినియోగదారులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఆ ఇబ్బందులు రాకుండా విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటోంది. వేగంగా కనెక్షన్లు ఇచ్చేలా నిబంధనలు సరళీకృతం చేసింది.
- ఇప్పటి వరకు సర్వీస్ లైన్ నిర్మాణ వ్యయం వసూలు
- ఇకపై వినియోగదారులకు తప్పనున్న ఆ భారం
ఇన్నాళ్లు గృహ, వాణిజ్య, వ్యవసాయ ఇలా ఏ విద్యుత్ కనెక్షన్లు కావాలన్నా వ్యయ ప్రయాసలతో పాటు మంజూరు కావడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. ఫలితంగా నెలల తరబడి వినియోగదారులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఆ ఇబ్బందులు రాకుండా విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంటోంది. వేగంగా కనెక్షన్లు ఇచ్చేలా నిబంధనలు సరళీకృతం చేసింది.
బెజ్జూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ తెచ్చిన నూతన నిబంధనలతో కిలోమీటరు వరకు కరెంటు స్తంభాలకు డబ్బులు చెల్లించనక్కర్లేదు. ఈ నిబంధనలతో రైతులకు కిలో మీటరు వరకు డబ్బులు చెల్లించకుండానే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. అదనపు విధ్యుత్తు స్తంభాల కోసం గతంలో లాగా ఔట్‌రైట్ కాంట్రిబ్యూషన్(ఓఆర్‌సీ) కింద డబ్బులు చెల్లించేవారు. కేటగిరీల వారీగా విద్యుత్ కనెక్షన్ల మంజూరు కోసం తీసుకోవాల్సిన చార్జీల సవరణ రేట్లను సైతం ప్రకటించింది. దీని ప్రకారం రైతులు కిలోవాటుకు రూ.1000చొప్పున ఎన్ని కిలో మీటర్ల సామర్థ్యం కలిగిన కనెక్షన్లు కావాలనుకుంటే ఆ మేరకు చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. దాంతో సిబ్బంది కరెంటు కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. విద్యుత్తు కనెక్షన్లు జారీ చేయడంలో జాప్యం జరగకుండా విద్యుత్ శాఖ కొత్త విధానం అమలుకు ఆదేశాలు జారీ చేసింది. గృహావసరాలతో పాటు గృహేతర, వ్యవసాయ, పరిశ్రమలకు విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. దరఖాస్తు చేసిన వెంటనే వినియోగదారులకు విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చేలా నిబంఽ దనలు రూపొందించారు. గతంలో మాదిరిగా ప్రతిపాదనలు పంపించడం, వాటి ప్రకారం రుసుం చెల్లించాల్సి ఉండేది. సర్వీస్ చార్జీలు చెల్లిస్తే కనెక్షన్లు ఇచ్చేలా ఈఆర్‌సీ నియమావళిని సవరించింది. కొత్త విధానం మేరకు ఈ సేవలో దరఖాస్తు చేసుకుంటే అంచనా వ్యయం అవసరం లేకుండానే కనెక్షన్లు ఇస్తున్నారు.
- రైతులకు ప్రయోజనం..
ఈ విధానంతో రైతులకు ప్రయోజనం కలుగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2.80 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. మరో ఐదు వేల మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారు. గతంలో ఉన్న నిబంధనల మేరకు రైతులు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.5,200డీడీ రూపేణా చెల్లించాల్సి వచ్చేది. ముగ్గురు నుంచి నలుగురు రైతులు కలిపి దరఖాస్తు చేసుకుంటే కనెక్షన్ కోసం అయ్యే లైన్ దూరం, విద్యుత్తు స్తంబాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వైరు తదితర వాటిని పరిగణలోకి తీసుకొని అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించేవారు. వారు రూ.1.20లక్షల అంచనా వ్యయమైతే ఇందులో ప్రభుత్వ రాయితీ రూ.75వేలుపోను మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దీన్ని పూర్తిగా రద్దు చేశారు.
- సవరించిన విద్యుత్ చార్జీలు ఇలా..
ఇంటికి విద్యుత్ కనెక్షన్ తీసుకుంటే ఒక కిలోవాట్‌కు రూ.500చొప్పున చెల్లించాలి. 1-5కేడబ్ల్యూ వరకు రూ.500, అదనపు కిలోవాట్‌కు రూ.600, 5-20వరకు రూ.2,900, అదనపు కిలోవాట్‌కు రూ.1500, 20కిలోవాట్‌పైన ప్రతి కిలోవాట్‌కు రూ.10,000, నాన్ డొమెస్టిక్ (షాపులు)1కిలో వాట్ వరకు రూ.1000, 1-5వరకు రూ.1000, అదనపు వాట్లకు రూ.1,500, ఇండస్ర్టీయల్(ఎల్టీ-3) 20కిలో వాట్ వరకు ప్రతి కిలో వాట్‌కు రూ.4,000, 20కిలో వాట్‌పైన ప్రతి కిలోవాట్‌కు రూ.10,000, ఎలక్ర్టిక్ వెహికిల్(ఈవీ) 1-20వరకు రూ.1000, అవనపు కిలోవాట్‌కు రూ.1200చెల్లించాల్సి ఉంటుంది.
నూతన నిబంధనలతో వినియోగదారులకు మేలు..
- అంజల్‌కుమార్, ట్రాన్స్‌కో ఏఈ, బెజ్జూరు
నూతన నిబంధనలతో వినియోగదారులకు మేలు కలగనుంది. గతంలో స్తంబాలు వేసుకునేవారికి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ నిబంధనతో కిలో మీటర్ వరకు ఎలాంటి రుసుము చెట్టించకుండానే విద్యుత్ స్తంబాలను సంస్థ వేయిస్తుంది. దీంతో వినియోగదారులు ఓఆర్‌సీ కట్టకుండానే కిలో మీటర్ వరకు స్తంబాలను వేసుకొవచ్చు. ఈ అవకాశంతో చాలా వరకు మేలు జరుగుతుంది.