Share News

విదేశాల్లో ఉన్నవారి ఓటూ పదిలమే!

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:32 AM

తెలంగాణలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌)పై ప్రజల్లో ఉన్న పలు సందేహాలకు కేంద్రఎన్నికల సంఘం....

విదేశాల్లో ఉన్నవారి ఓటూ పదిలమే!

  • సర్‌ ప్రక్రియ తర్వాత వారి ఓట్లు తొలగించరు.. ఏపీలో ఓటు ఉన్నవారూ హైదరాబాద్‌లో నమోదు చేసుకోవచ్చు

  • అక్కడ తీసేసి ఇక్కడ ఇస్తారు

  • సర్‌ ప్రక్రియలో సందేహాలపై ఎన్నికల సంఘం వివరణ

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్‌)పై ప్రజల్లో ఉన్న పలు సందేహాలకు కేంద్రఎన్నికల సంఘం (ఈసీఐ) వివరణ ఇచ్చింది. ముఖ్యంగా సర్‌ తర్వాత విదేశాల్లో ఉన్నవారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటాయా..? అవి కొనసాగాలంటే ఏం చేయాలన్న దానిపై స్పష్టతనిచ్చింది.

విదేశాల్లో ఉన్న భారతీయుల ఓట్లు సర్‌తర్వాత కూడా ఉంటాయా?

భారత పౌరసత్వం ఉండి.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు స్వదేశంలో ఓటు హక్కు ఉంటుంది. వారు తమ స్వస్థల నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవచ్చు. కేవలం విదేశాల్లో ఉన్నారనే కారణంతో ఓటును తొలగించరు.

ఎస్‌ఐఆర్‌ సమయంలో వారేం చేయాలి?

సర్‌ ప్రక్రియలో తమ ఓటు వివరాలను ధ్రువీకరించుకోవాలి. ఎన్నికల సంఘం కోరిన వివరాలు, పత్రాలను సమర్పించి ఓటు కొనసాగుతుందని నిర్ధారించుకోవచ్చు.

విదేశాల్లో ఉన్న వ్యక్తి వచ్చి పత్రాలు ఇవ్వాలా?

అవసరం లేదు. కుటుంబ సభ్యులు, బంధువులు లేదా అధీకృత ప్రతినిధి ద్వారా అవసరమైన పత్రాలను సమర్పించవచ్చు. ఎన్నికల అధికారులు సూచించిన విధానాన్ని అనుసరించాలి.

విదేశాల్లో ఉన్నవారు ఏ పత్రాలు ఇవ్వాలి?

భారతీయ పాస్‌పోర్టు ప్రతులు, ప్రస్తుత చిరునామా వివరాలు, పాత ఓటరు గుర్తింపు కార్డు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఎన్నికల సంఘం కోరిన ఇతర పత్రాలు సమర్పించాలి.


విదేశాల్లో ఉండి సర్‌ సమయంలో స్పందించకపోతే ఏమవుతుంది?

ఎన్నికల అధికారులు నిర్వహించే పరిశీలనలో అవసరమైన సమాచారం అందుబాటులో లేకపోతే ఓటరు వివరాలపై సందేహాలు తలెత్తవచ్చు. అందువల్ల నిర్ణీత సమయంలో వివరాలు సమర్పించడం మంచిది.

విదేశాల్లో ఉన్న ఓటరు తన పేరు జాబితాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌, ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌.. లేదంటే. స్థానిక ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించడం ద్వారా తన పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు.

విదేశాల్లో ఉన్న వ్యక్తి కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చా?

నమోదు చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన భారత పౌరుడు విదేశాల్లో ఉన్నప్పటికీ, తన శాశ్వత నివాసం ఉన్న భారత చిరునామా ఆధారంగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

విదేశాల్లో ఉన్నవారి పేర్లను కుటుంబ సభ్యులు తొలగించాలని కోరితే తొలగిస్తారా?

తొలగించరు. ఎన్నికల సంఘం విధానాన్ని అనుసరించి, సంబంధిత ఆధారాలు పరిశీలించిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకుంటారు.

విదేశాల్లో ఉన్న ఓటర్లకు ఈసీ సూచన ఏంటి?

సర్‌ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఓటరు తన ఓటు నమోదు వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. అవసరమైన పత్రాలను కుటుంబసభ్యుల ద్వారా సమర్పించాలి. అప్పుడు ఓటుహక్కు సురక్షితంగా ఉంటుంది.

2002లో హైదరాబాద్‌లో ఓటరుగా ఉన్న ఒక వ్యక్తి, 2018లో విజయవాడ (ఆంధ్రప్రదేశ్‌)లో ఓటు నమోదు చేసుకొని.. ప్రస్తుతం మళ్లీ హైదరాబాద్‌ (తెలంగాణ)లోనే ఓటు హక్కు పొందాలనుకుంటే ఏం చేయాలి?

ఎన్నికల చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే సమయంలో ఒకే నియోజకవర్గంలో మాత్రమే ఓటు హక్కు ఉండాలి. కాబట్టి ప్రస్తుతం విజయవాడలో ఓటరుగా ఉన్న వ్యక్తి తిరిగి హైదరాబాద్‌లో ఓటు హక్కు పొందాలనుకుంటే నిర్దిష్ట పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. హైదరాబాద్‌లో శాశ్వతంగా నివసిస్తున్నట్లు నిరూపించే పత్రాలను సమర్పించాలి. పాత ఓటరు గుర్తింపుకార్డు, పాత ఓటరు జాబితా ప్రతులు, ఎన్నికల కార్యాలయం జారీ చేసిన ధ్రువపత్రాలు ఇందుకు ఉపయోగపడతాయి. ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, రేషన్‌ కార్డు, విద్యుత్‌ బిల్లు, నీటి బిల్లు, గ్యాస్‌ కనెక్షన్‌ పత్రాలలో ఏవైనా దరఖాస్తుతోపాటు సమర్పించవచ్చు. 2002లో హైదరాబాద్‌లో ఓటరుగా ఉన్నట్లు నిరూపించే పాత రికార్డులు కూడా చూపించాలి. హైదరాబాద్‌లో ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసినప్పుడు విజయవాడలోని ఓటును తొలగిస్తారు.


సర్‌ సమయంలో ఏ ఫారం నింపాలి?

కొత్తగా ఓటరు నమోదు.. లేదా ఓటు బదిలీ కోసం ఫారం-6ను ఉపయోగిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సర్‌ సమయంలో ప్రత్యేక దరఖాస్తుపత్రాలు ఉంటే వాటిని కూడా సమర్పించాలి.

పాత ఓటరు సంఖ్య తెలియకపోతే?

ఓటరు పేరు, తండ్రి పేరు, ఇంటి చిరునామా, పాత నియోజకవర్గ వివరాల ఆధారంగా ఎన్నికల అధికారులు పాత రికార్డులను పరిశీలించగలరు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌వో), ఇతర ఎన్నికల సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి వివరాలను పరిశీలిస్తారు. పత్రాలను తనిఖీ చేసి అర్హతను నిర్ధారించిన తర్వాత ఓటరు జాబితాలో పేరు నమోదు చేస్తారు.

Updated Date - Jun 20 , 2026 | 04:32 AM