పింఛను కోసం గంటన్నర క్యూలో గుండెపోటుతో వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:22 AM
పింఛను తీసుకునేందుకు గంటన్నరపాటు క్యూలైన్‌లో వేచి ఉన్న వృద్ధురాలు గుండెపోటుతో మృతిచెందింది బుధవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో ఈ విషాదం నెలకొంది.
చందంపేట, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పింఛను తీసుకునేందుకు గంటన్నరపాటు క్యూలైన్‌లో వేచి ఉన్న వృద్ధురాలు గుండెపోటుతో మృతిచెందింది బుధవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో ఈ విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చందంపేట మండలం పోల్యానాయక్‌తండాకు చెందిన రమావత్ గుగాని(65) భర్త పదేళ్లక్రితం మృతిచెందాడు. ఆమె ముగ్గురు కుమారులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. పోల్యానాయక్‌తండాలో గుగాని ఒంటరిగా ఉంటోంది. ప్రతి నెల వచ్చే పింఛను డబ్బులతో బతుకుతోంది. ఆగస్టు నెల పించన్ తీసుకునేందుకు మూడు రోజులుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముడుదండ్ల గ్రామానికి వచ్చివెళుతోంది. గుగాని వెళ్లిన సమయంలో అక్కడ పోస్టుమాస్టర్ లేకపోవడంతో పింఛను తీసుకోలేకపోయింది. స్వగ్రామం నుంచి ముడుదండ్ల వైపు బస్సు, ఆటో సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజు రానుపోను ఆరు కిలోమీటర్లు నడిచివెళ్లేది. బుధవారం కూడా తండా నుంచి ముడుదండ్లకు వచ్చింది. ఉదయం10 గంటలకు క్యూలైన్‌లో నిలబడగా ఆమె ముందు 50మంది పింఛను కోసం వేచి ఉన్నారు. ఆన్‌లైన్ నెట్‌వర్క్ సమస్యతో పించను ఇవ్వడం ఆలస్యంకాగా 11.30 సమయంలో గుగాని నిల్చున్న చోటే కుప్పకూలింది. ఆమెకు సపర్యలు చేసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. పోస్ట్‌మాస్టర్ నిర్లక్ష్యం కారణంగానే గుగాని మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.