Share News

వృద్ధులకు మందుల గండం!

ABN , Publish Date - May 03 , 2026 | 04:56 AM

వయస్సు మళ్లిన తర్వాత మనుషులు రోగాల బారిన పడడం సహజం. ఆ రోగాల నుంచి ఉపశమనం పొందేందుకు మందులు వాడడం కూడా సహజమే.

వృద్ధులకు మందుల గండం!

  • 60ఏళ్లు పైబడిన వారిలో అధికంగా పాలీఫార్మసీ

  • ఒకేసారి ఎక్కువ మందులు, సమన్వయం లేకుండా వాడకం

  • ఔషధాల అతి వినియోగంతో డ్రగ్‌ రియాక్షన్‌ ముప్పు

  • ఖమ్మం మమత మెడికల్‌ కాలేజీ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): వయస్సు మళ్లిన తర్వాత మనుషులు రోగాల బారిన పడడం సహజం. ఆ రోగాల నుంచి ఉపశమనం పొందేందుకు మందులు వాడడం కూడా సహజమే. అయితే, ’కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు’గా ఆరు పదుల వయసు దాటిన వారి పరిస్థితి మారుతోంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న చాలా మంది వృద్ధులు.. రోజుకు ఐదారు రకాల మందులు తీసుకుంటాంటారు. ఇలాంటి వారిలో ఆ మందుల వల్ల కొత్త సమస్యలు తలెత్తి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఖమ్మం మమత మెడికల్‌ కాలేజీ పరిశోధక బృందం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఓ వ్యక్తి ఐదు లేదా అంతకంటే మందులు వేసుకోవడాన్ని పాలీఫార్మసీ అంటారు. వృద్ధుల్లో పాలిఫార్మసీ విపరీతంగా పెరుగుతోందని, దీనివల్ల డ్రగ్‌ రియాక్షన్‌ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ 100 మందిలో 64 శాతం మందికి డ్రగ్‌ రియాక్షన్‌ ముప్పు అధికంగా ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. ఖమ్మం మమత మెడికల్‌ కాలేజీలో 2025 ఫిబ్రవరి నుంచి 2026 జనవరి వరకు ఏడాది పాటు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ రీసెర్చ్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.


పొంచి ఉన్న డ్రగ్‌ రియాక్షన్ల ముప్పు

అధ్యయనంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన 100 మంది వృద్ధుల ఆరోగ్య పరిస్థితి, వారు వినియోగిస్తున్న మందులను నిపుణులు పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న రోగులకు వైద్యులు సగటున 7.4 రకాల మందులను సిఫారసు చేశారు. ఈ రోగుల్లో ఏకంగా 78 శాతం మంది పాలీఫార్మసీ కేటగిరిలో ఉన్నారు. 24 శాతం మంది వృద్థులు ఏకంగా 10 అంతకంటే ఎక్కువ రకాల మందులను ప్రతిరోజూ తీసుకుంటున్నారు. ఈ వృద్ధుల్లో అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు, హృద్రోగ, కిడ్నీ తదితర సమస్యలతో బాధపడుతున్న వారున్నారు. వీరిలో కొందరు రెండు అంతకంటే ఎక్కువ జబ్బులతో బాధపడుతుండడం వల్ల వేర్వేరు వైద్యులు సిఫారసు చేసిన మందులను వినియోగిస్తున్నారు. అయితే, ఒకేసారి అనేక రకాల మందులు తీసుకోవడం వల్ల ఆ మందుల మధ్య జరిగే రసాయన చర్యలు జరిగి సైడ్‌ ఎఫెక్ట్స్‌కు అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. 64 శాతం మంది రోగులలో కనీసం ఒక డ్రగ్‌ రియాక్షన్‌ జరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 148 డ్రగ్‌ ఇంటరాక్షన్లను పరిశోధకులు గుర్తించగా.. ఇందులో 54.7శాతం మధ్యస్థంగా, 27.7శాతం స్వల్పంగా, 17.6 శాతం అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. రోగి వాడే మందుల సంఖ్య పెరిగే కొద్దీ, జబ్బుల సంఖ్య 3 దాటితే ఈ డ్రగ్‌ రియాక్షన్ల ముప్పు గణనీయంగా పెరుగుతోందని గుర్తించారు. ఈ నేపథ్యంలో మందులు రాసే ముందు రోగి పాత ప్రిస్ర్కిప్షన్లను వైద్యులు తనిఖీ చేసి, అవసరం లేని మందులను తగ్గించాలని డాక్టర్‌ సురేష్‌ బాబు సాయన, డాక్టర్‌ ఆలస్యం నవీన్‌, శ్రీహర్ష రాయల బృందం ఈ నివేదికలో స్పష్టం చేసింది.


పాలీ ఫార్మసీతో నష్టాలు

రెండు వేర్వేరు మందులు కలిసినప్పుడు అవి శరీరంలో రసాయన చర్య జరుపుతాయి. దీనివల్ల ఒక మందు పనితీరు తగ్గవచ్చు. లేదా ఆ రెండు కలిసి విషతుల్యమైన ప్రభావాన్ని చూపవచ్చు. ఎక్కువ మందులు వాడటం వల్ల కళ్లు తిరగడం, అలసట, జీర్ణక్రియ సమస్యలు, కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. వృద్ధుల్లో దీనివల్ల సమతుల్యత దెబ్బతిని కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఒక మందు వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్‌ను మరో వ్యాధిగా పొరబడి, దానిని తగ్గించడానికి వైద్యుడు మరో కొత్త మందు రాస్తారు. ఇలా మందుల సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది. ఇది రోగిపై ఆర్థిక భారాన్ని కూడా పెంచుతుంది.

ప్రమాదకరమైన మందుల కలయికలు ఇవే

  • సాధారణంగా వైద్యులు వ్రాయండి కొన్ని మందుల కాంబినేషన్లు వృద్థుల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని అధ్యయనం హెచ్చరించింది:

  • 1.ఆస్పిరిన్‌ + క్లోపిడోగ్రెల్‌: గుండె సమస్యల కోసం ఈ రెండింటినీ కలిపి వాడటం వల్ల రోగుల్లో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.

  • 2.ఇన్సులిన్‌ + బీటా-బ్లాకర్స్‌: షుగర్‌, బీపీ మందులు కలిపి వాడే వృద్థుల్లో షుగర్‌ లెవల్స్‌ పడిపోయినప్పుడు వచ్చే ముందస్తు హెచ్చరిక లక్షణాలను బీపీ మందులు అణచివేస్తాయి. దీనివల్ల రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

  • 3. ఇన్హిబిటర్లు +పొటాషియం: బీపీ మందులు, కిడ్నీ సమస్యలకు వాడే మందుల వల్ల రక్తంలో పొటాషియం స్థాయి పెరిగి గుండెపై ప్రభావం పడుతుంది.

Updated Date - May 03 , 2026 | 04:56 AM