Share News

వయోధికుల జీవనం.. దయనీయం!

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:04 AM

దేశంలో వయోధికుల స్థితిగతులు నానాటికీ దయనీయంగా మారుతున్నాయి. ఒకవైపు మలిసంధ్యలో ముప్పేట దాడికి దిగే ఆరోగ్య సమస్యలు, మరో వైపు వాతావరణ మార్పులు..

వయోధికుల జీవనం.. దయనీయం!

  • 70శాతం మందికి సురక్షితం కాని ఇళ్లే దిక్కు .. వాతావరణ మార్పులతో 78శాతం మందికి కష్టాలు

  • 92శాతం మందికి నెలవారీ ఆదాయం రూ.10వేల లోపే

  • రోజూ వారీ పనులూ చేసుకోలేని వారు 46శాతం మంది

  • 36శాతం మందికి హై బీపీ.. 18శాతం మందికి మధుమేహం

  • తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో హెల్పేజ్‌ ఇండియా సర్వే

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): దేశంలో వయోధికుల స్థితిగతులు నానాటికీ దయనీయంగా మారుతున్నాయి. ఒకవైపు మలిసంధ్యలో ముప్పేట దాడికి దిగే ఆరోగ్య సమస్యలు, మరో వైపు వాతావరణ మార్పులు.. వృద్ధులకు కఠిన పరీక్షలు పెడుతున్నాయి. పర్యావరణ మార్పుల వల్ల అత్యధికంగా నష్టపోతున్నది వయోధికులేనని తేలింది. వయోధికులపై వేధింపుల నివారణ దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం జాతీయ స్థాయి అధ్యయన నివేదికను హెల్పేజ్‌ ఇండియా సంస్థ ప్రతినిధులు విడుదల చేశారు. ‘వాతావరణ మార్పులను తట్టుకొని నిలవడంలో వయోధికులకు ఆసరా’ అంశంపై 10 రాష్ట్రాల్లోని 20 జిల్లాల్లో మొత్తం 2,224 మందిపై హెల్పేజ్‌ ఇండియా ఈ అధ్యయనం నిర్వహించింది. సంబంధిత నివేదికలో సామాజికంగా వయోధికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతోపాటు ఆర్థిక, అనారోగ్య సమస్యలను ప్రస్తావించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ..

  • గత మూడేళ్లలో 78శాతం మంది వయోధికులు వాతావరణ మార్పులవల్ల తలెత్తే విపత్తులను ఎదుర్కొన్నా రు. అందులో 45శాతం మంది వడగాలులు, 27 శాతం మంది వరదలు, మరొక 20శాతం మంది కరువు వల్ల ఇబ్బందులు పడ్డారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకొని నిలవడంలో ఆర్థిక పరిమితులే అడ్డంకిగా ఉన్నాయని 69శాతం మంది చెప్పారు. గతేడాది 77శాతం మంది ఒక్కసారైనా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు.

  • సురక్షితంకాని ఇళ్లలో 69శాతం మంది వయోధికులు నివసిస్తున్నారు. 92శాతంమంది వయోధికుల నెలవారీ ఆదాయం 10వేలకన్నా తక్కువగా ఉంది. మనీ మేనేజ్‌మెంట్‌లో 64శాతం మంది, ప్రయాణాలప్పుడు 67శాతం మంది వయోధికులు ఇతరులపై ఆధారపడుతున్నారు.

  • 95శాతం మంది వయోధికులకు బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా ఉన్నప్పటికి, 50శాతం మంది మాత్రమే స్వతంత్రంగా నిర్వహిస్తున్నారు.


  • ఒంట్లో సత్తువలేక, శరీరం సహకరించక రోజూవారీ పనులు చేసుకోవడంలో 46శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు. 32శాతంమంది నడవలేక, 24శాతం మంది కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నారు.

  • కుటుంబ సభ్యుల సంరక్షణలో 94మంది వయోధికులు ఉండగా, అందులో 30శాతం మంది జీవిత భాగస్వామి, 31శాతం మంది కుమారులు, 17శాతం మందికి కుమార్తెలు, కోడళ్ల నుంచి సహాయం పొందుతున్నారు.

  • వయోధికుల్లో 49శాతం మంది పెన్షన్‌పై ఆధారపడుతుండగా, శరీరం సహకరించకపోయినా.. 25శాతం మంది వ్యవసాయం చేస్తున్నారు.

  • ఔషధాలు కొన లేక 52శాతం మంది, తగిన ఆహారం తీసుకోలేక 29శాతం మంది ఇబ్బంది పడుతున్నారు.

  • అధ్యయనంలో పాల్గొన్న వారిలో 53శాతం మంది ఆరోగ్యం బాగుందని చెప్పగా, 32శాతం మంది సాధారణస్థితిలో ఉందని, 15శాతంమంది అనారోగ్యంతో బాధపడుతున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులతో 52శాతం, అధికరక్తపోటుతో 36శాతం, మధుమేహంతో 18శాతం, వినికిడి లోపంతో 17శాతం మంది అవస్థలు పడుతున్నారు. 35శాతంమంది మాత్రమే అవసరమైనప్పుడు వైద్యసేవలు పొందగలుగుతున్నారు.

  • కుటుంబ సభ్యుల నుంచి పొందే గౌరవమర్యాదల పట్ల తాము సంతృప్తికరంగా ఉన్నామని 58శాతం మంది పేర్కొన్నారు. సమాజం నుంచి తమకు నిరంతరం మద్దతు లభిస్తుందని 33శాతం మంది చెప్పగా, అసలు అందడం లేదని 25శాతం మంది తెలిపారు.

  • వయోధికుల కోసం పనిచేస్తున్న హెల్ప్‌లైన్ల గురించి 11శాతం మందికి మాత్రమే తెలుసని తేలింది.

  • వాతావరణ మార్పులు ఇతర సవాళ్లను ఎదుర్కోవడంలో మరింత ఆర్థిక సాయం అవసరమని 72శాతం మంది అభిప్రాయపడ్డారు.

హెల్పేజ్‌ ఇండియా సేవలు భేష్‌

హెల్పేజ్‌ ఇండియా నివేదికను దివ్యాంగుల, వయోధికుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ బి. శైలజ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి జిల్లాలో వయోధికుల కోసం డేకేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వయోధికుల రక్షణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రతి ఏరియా ఆస్పత్రిలో జిరియాట్రిక్‌ విభాగాన్ని (వృద్ధుల కోసం ప్రత్యేక విభాగాన్ని) నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. హెల్పేజ్‌ ఇండియా సేవలను భేష్‌ అని ఆమె కొనియాడారు. తెలంగాణ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జీవీ నారాయణరావు మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా వయోధికుల కోసం ప్రత్యేక విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. వయోధికుల సమస్యలను మాట్లాడకపోవడం కూడా ఒక రకమైన వేధింపులేనని హెల్పేజ్‌ ఇండియా ఏపీ, టీజీ బాధ్యుడు యతేంద్ర యాదవ్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Jun 16 , 2026 | 05:04 AM