ఒంటరి జీవితమే శాపమై...!!
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:37 AM
ఒంటరి జీవితం.. ఇరుగుపొరుగు లేని ఓ భవనంలో నివాసం.. ఆపై వృద్ధాప్యం.. వెరసి ఏ తోడూ లేని ఓ వృద్ధుడు అనారోగ్యంతో ఇంట్లోనే మరణించాడు.
అనారోగ్యంతో తన ఇంట్లో మరణించిన వృద్ధుడు
మృతదేహాన్ని పీక్కుతిన్న ఎలుకలు, పందికొక్కులు
దుర్వాసన వెలువడడంతో ఆలస్యంగా వెలుగులోకి
నల్లగొండ జిల్లా దేవరకొండలో ఘటన
దేవరకొండ, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ఒంటరి జీవితం.. ఇరుగుపొరుగు లేని ఓ భవనంలో నివాసం.. ఆపై వృద్ధాప్యం.. వెరసి ఏ తోడూ లేని ఓ వృద్ధుడు అనారోగ్యంతో ఇంట్లోనే మరణించాడు. ఆ వృద్ధుడు ఉన్నాడో.. పోయాడో అనే విషయాన్ని పట్టించుకునే వారే లేకపోవడంతో.. అతని మృతదేహాన్ని కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు పీక్కుతిన్నాయి. ఆ ఇంటి నుంచి దుర్వాసన వెలువడడాన్ని స్థానికులు గమనించడంతో ఆ వృద్ధుడి మరణ వార్త ఆలస్యంగా లోకానికి తెలిసింది. కానీ వృద్ధుడి మృతదేహం ఎముకల గూడులా మిగిలింది. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆదివారం వెలుగు చూసిన ఈ హృదయవిదారక ఘటన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన నాయిని రాజగోపాల్‌రెడ్డి(82)కి ఎవరూ లేరు. రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి బంధువు కూడా. రాజగోపాల్ రెడ్డికి వరసకు సోదరుడైన రాంరెడ్డి అనే వ్యక్తికి దేవరకొండ గాంధీనగర్‌లో ఓ ఇల్లు ఉంది. 60 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ భవనం సమీపంలో ఎటువంటి ఇళ్లు లేవు. అలాంటి ఆ ఇంట్లో రాజగోపాల్ రెడ్డి పదేళ్లుగా ఒంటరిగా నివాసముంటున్నాడు.
నేరేడుగొమ్ములో తనకున్న 20 ఎకరాల భూమిని కౌలుకు ఇవ్వడం వల్ల వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఆ భవనం నుంచి దుర్వాసన వెలువడడాన్ని గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తమ సిబ్బందితో కలిసి ఆదివారం ఆ ఇంటికి వెళ్లిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకట్‌రెడ్డి.. ఓ గదిలో కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు పీక్కుతిని, కుళ్లిన దశలో ఎముకల గూడులా ఉన్న రాజగోపాల్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. గదిలో దొరికిన ఫోన్ ఆధారంగా రాజ్‌గోపాల్ రెడ్డి మే 26న తన స్నేహితుడితో మాట్లాడినట్టు తెలుసుకున్నారు. మృతదేహం ఉన్న పరిస్థితి ప్రకారం ఆయన కనీసం 10 రోజులు క్రితం మరణించి ఉంటాడని పోలీసులు అంచనా వేశారు. రాజగోపాల్ రెడ్డి మృతిపై అతని బంధువులకు సమాచారమిచ్చారు.