జూరాలకు నీరివ్వండి
ABN , Publish Date - Sep 23 , 2026 | 06:04 AM
జూరాల ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను మంగళవారం కలిసి కోరింది. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డిల బృందం బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎంతో భేటీ అయింది.
5.5 లక్షల ఎకరాల్లో కీలక దశలో పంటలు
వాటిని కాపాడాలంటే 13 టీఎంసీలు కావాలి
5 వేల క్యూసెక్కులను నెల పాటు ఇవ్వండి
కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కలిసి
కోరిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు
తెలంగాణ రైతులకు ప్రయోజనం చేకూరేలా
నిర్ణయం తీసుకుంటామని డీకే హామీ
జూరాలలో ఈ పరిస్థితికి బీఆర్‌ఎస్సే కారణం
గట్టు, భూత్పూర్, గూడెందొడ్డి రిజర్వాయర్లు
నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?
రాజకీయలబ్ధికే బీఆర్‌ఎస్ హడావుడి: జూపల్లి
బీఆర్‌ఎస్ హయాంలోనూ తాగునీటి
అవసరాలకు జూరాలలో నీరు నిల్వ ఉంచారు
అప్పుడు మేం రాజకీయం చేశామా?: వాకిటి
హైదరాబాద్/గద్వాల న్యూటౌన్, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టుకు నీరు విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను మంగళవారం కలిసి కోరింది. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డిల బృందం బెంగళూరు వెళ్లి కర్ణాటక సీఎంతో భేటీ అయింది. ప్రస్తుతం జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు కీలక దశలో ఉన్నందున, వాటిని కాపాడేందుకు కర్ణాటక నుంచి కృష్ణా జలాలను విడుదల చేయాల్సిన అవసరాన్ని డీకే దృష్టికి తెలంగాణ ప్రతినిధి బృందం తీసుకెళ్లింది. ఈ నాలుగు సాగునీటి పథకాల కింద దాదాపు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, ఈ ప్రాంతాల్లో వేలాది రైతు కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయని వివరించింది. ప్రస్తుత దశలో నీటి కొరత ఏర్పడితే పంట దిగుబడులతో పాటు రైతుల ఆదాయం, జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుత పంటలను కాపాడేందుకు కృష్ణా నది నుంచి 5,000 క్యూసెక్కులను నిరంతరాయంగా నెల రోజుల పాటు విడుదల చేయాలని కోరింది. ఈ నీటితో కీలక దశలో ఉన్న పంటలకు సకాలంలో సాగునీరు అందించి రైతులను ఆదుకోవచ్చని వివరించింది. సహకార స్ఫూర్తితో సానుకూలంగా స్పందించాలని కోరింది. దీనిపై కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, బెంగళూరు బయలుదేరి వెళ్లే ముందు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం సీఎల్పీ మీడియా హాల్లో మీడియా సమావేశంలో మాట్లాడింది. జూరాల ప్రాజెక్టు వద్ద ప్రస్తుత పరిస్థితికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని మంత్రి జూపల్లి విమర్శించారు.
కాళేశ్వరంలో భాగంగా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ లాంటి రిజర్వాయర్లు కట్టిన కేసీఆర్.. జూరాల కింద ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు కోసం అదనంగా ఎందుకు రిజర్వాయర్లు కట్టలేదని ప్రశ్నించారు. గట్టు, భూత్పూర్, గూడెందొడ్డి రిజర్వాయర్లను ఆయన నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా అని నిలదీశారు. జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక సీఎంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇప్పటికే మాట్లాడారని, ఈ నెల 20న లేఖ కూడా రాశామని తెలిపారు. ఈ విషయంలో రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ పార్టీ హడావుడి చేస్తోందన్నారు. ‘‘జూరాలలో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ మేరకు పూడిక పేరుకుపోయింది. మరో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజీ. ఈ నీటిని తీసుకోలేం. ఇంకో 2.5 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం కేటాయించాం. మరో టీఎంసీ నీళ్లు ఆవిరిగా మారతాయి.
ఇక రైతులకు వదలడానికి ఆ ప్రాజెక్టులో నీళ్లు ఎక్కడివి?’’ అని జూపల్లి ప్రశ్నించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో కూడా జూరాల నీటిని తాగునీటి కోసం నిల్వ ఉంచారని, కానీ ఆనాడు తాము రాజకీయం చేయలేదని చెప్పారు. నీళ్లు వస్తే ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకే బీఆర్‌ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారన్నారు. పెయిడ్ ఆర్టిస్టుల చప్పట్ల కోసం కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల లొకేషన్ కూడా తెలియని కేటీఆర్ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని మేఘారెడ్డి విమర్శించారు.
బీఆర్‌ఎస్ వైఫల్యాల వల్లే: ఉత్తమ్
రాష్ట్రంలో ప్రస్తుత నీటి సంక్షోభానికి ఎల్‌నినో ఒక్కటే కారణం కాదని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలు సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆకాశంలో ఎల్‌నినో వర్షాలను తగ్గిస్తే.. భూమిపై నీటి నిల్వలు లేకుండా బీఆర్‌ఎస్ చేసిందని ఆక్షేపించారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా పాలమూరు-రంగారెడ్డి చేపట్టడానికి నిర్ణయించి, జీవో జారీ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి పాలమూరు-రంగారెడ్డిని మార్చి... దక్షిణ తెలంగాణ ప్రజల గొంతు కోశారని ఆక్షేపించారు. కేవలం కమీషన్ల కోసమే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మార్పులు చేశారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు వెచ్చించినా ఒక్క పెండింగ్ ప్రాజెక్టును పూర్తిచేయలేదని ఆక్షేపించారు. జూరాల ఆయకట్టు పంటలను కాపాడేందుకు ప్రతి అవకాశాన్నీ పరిశీలిస్తున్నామని, కర్ణాటక నుంచి నీరు వస్తే అత్యవసర ప్రాంతాలకు అందించి, పంటలను కాపాడతామన్నారు. తాగునీటి అవసరాల కోసమే రిజర్వాయర్లలో నీటిని నిల్వ ఉంచామని, నాగార్జున సాగర్ నుంచి నీటిని వదలాలో వద్దో తమకు తెలుసని అన్నారు.