విద్యాశాఖకు హైకోర్టు 25 వేల జరిమానా
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:02 AM
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు డివిజన్ బెంచ్ గట్టి షాక్ ఇచ్చింది. ఒక కేసులో లిమిటేషన్ పీరియడ్ (సాధారణంగా 30 రోజులు) తర్వాత.. 250 రోజులు ఆలస్యంగా అప్పీల్ దాఖలు చేసిన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈ వో) తదితరులకు రూ.25 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం సంచలన ఉత్తర్వులు జారీచేసింది
ఒక కేసులో 250 రోజులు ఆలస్యంగా అప్పీల్ దాఖలు చేయడమే కారణం
ఆలస్యానికి కారకులు ఎవరో విచారించాలని ముఖ్యకార్యదర్శికి ఆదేశం
బాధ్యుడైన అధికారి నుంచి జరిమానా వసూలు చేసుకోవచ్చని స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు డివిజన్ బెంచ్ గట్టి షాక్ ఇచ్చింది. ఒక కేసులో లిమిటేషన్ పీరియడ్ (సాధారణంగా 30 రోజులు) తర్వాత.. 250 రోజులు ఆలస్యంగా అప్పీల్ దాఖలు చేసిన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈ వో) తదితరులకు రూ.25 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం సంచలన ఉత్తర్వులు జారీచేసింది. ఈ జరిమానా మొత్తాన్నీ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి రెండువారాల్లో జమ చేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శామ్ కోషీ, జస్టిస్ నర్సింగ్‌రావు ధర్మాసనం పేర్కొంది. ఈ ఆలస్యానికి కారకులు ఎవరో విచారణ చేపట్టి తేల్చాలని విద్యాశా ఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది. జరిమానాను.. బాధ్యుడైన అధికారి నుంచి వసూలు చేసుకోవచ్చని సూచించింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ జరిమానాతో.. విద్యాశాఖ 250రోజులు ఆలస్యంగా దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు స్వీకరించింది. దానిపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ప్రైవేటు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
ఇదీ నేపథ్యం...
వివేక వర్ధిని ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న కె.గిరీశ్ అనే ఉపాధ్యాయుడు తన సర్వీసు రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. ఆయన సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని పేర్కొంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అయితే సింగిల్ జడ్జి ఆ ఉత్తర్వులు చేయడానికి ముందే.. పిటిషనర్ మృతిచెందారు. మృతిచెందిన వ్యక్తి సర్వీసు రెగ్యులరైజ్ చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వ డం చెల్లదని విద్యాశాఖ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. అయి తే.. ఈ అప్పీల్ దాఖలు చేయడానికి లిమిటేషన్ పీరియడ్ తర్వాత కూడా 250 రోజులు ఆలస్యం చేసింది. దీనిపైనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత అప్పీల్‌లో ప్రభుత్వానికి బలమైన కేసు ఉందంటూనే.. ఆలస్యం చేసినందుకు రూ.25 వేలు జరిమానా విధించి, అప్పీల్‌ను విచారణకు స్వీకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.