Share News

kumaram bheem asifabad- కరెంట్‌పై ఎల్‌నినో ఎఫెక్టు..

ABN , Publish Date - Oct 14 , 2026 | 10:19 PM

ఎండల తీవ్రత.. లోటు వర్షపాతం.. భూగర్భ జలా మట్టాలు పడి పోవడం వెరసి జిల్లాలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండడంతో వ్యవసాయ మోటర్లతో పాటు గృహాలు, వాణిజ్య సంస్థల్లో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగింది. దీంతో జిల్లా పరిధిలో విద్యుత్‌ డిమాండు గత ఏడాదితో పోలీస్తే భారీగా పెరిగింది

kumaram bheem asifabad- కరెంట్‌పై ఎల్‌నినో ఎఫెక్టు..
లోగో

- ఎండల తీవ్రతతో వ్యవసాయ మోటార్లు, ఏసీల వాడకం

- ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు భారం

- నిరంతరం సరఫరాకు టీజీఎన్‌పీడీసీఎల్‌ చర్యలు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎండల తీవ్రత.. లోటు వర్షపాతం.. భూగర్భ జలా మట్టాలు పడి పోవడం వెరసి జిల్లాలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండడంతో వ్యవసాయ మోటర్లతో పాటు గృహాలు, వాణిజ్య సంస్థల్లో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగింది. దీంతో జిల్లా పరిధిలో విద్యుత్‌ డిమాండు గత ఏడాదితో పోలీస్తే భారీగా పెరిగింది. పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయలు తలెత్తకుండా టీజీఎన్‌పీడీసీఎల్‌ అధికారు లు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు భారాన్ని తగ్గించటంతో పాటు పంపిణీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కాగా జిల్లాలో విద్యుత్‌ వినియోగం, గరిష్ట డిమాండు గణాంకాలు పెరుగుతున్న భారాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2025 అక్టోబరుతో పోలీస్తే 2026 అక్టోబరులో విద్యుత్‌ వినియోగం 19.25 శాతం పెరగగా, గరిష్ట విద్యుత్‌ డిమాండు 25.86 శాతం అధికమైంది. గత ఏడాది అక్టోబరులో 9.44 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న విద్యుత్‌ వినియోగం ఈ ఏడాది 11.26 మిలియన్‌ యూనిట్లకు చేరింది. అంటే అదనంగా 1.82 మిలియన్‌ యూనిట్‌ విద్యుత్‌ వినియోగం పెరిగింది. వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ అఽవసరాలు, గృహ విద్యుత్‌ వినియోగం పెరుగుదల ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

లోటు వర్షపాతం కారణంగా..

లోటు వర్ష పాతం కారణంగా పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు, బావులపై ఆధారపడుతున్నారు. భూగర్భ జల మట్టాలు తగ్గడంతో నీటిని తోడేందుకు మోటార్లను ఎక్కువ సేపు నడుపాల్సి వస్తోంది. నడపాల్సి వస్తోంది. వ్యవసాయ విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. మరో వైపు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ఇళ్లలో ఏసీలు, కూలర్ల వినియోగం అధికమైంది. వ్యవసాయ, గృహ, వాణిజ్య రంగాల నుంచి ఒకేసారి పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలు పంపిణీ వ్యవస్థపై అదనపు భారాన్ని మోపుతున్నాయి., కాగా విద్యుత్‌ వినియోగం ఒక్కసారి పెరుగడంతో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు(డీటీఆర్‌లు) అధిక భారాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల సమయంలో ట్రాన్స్‌ఫార్మర్లలో వేడి పెరగడం, శీతలీకరణకు తగిన పరిస్థితులు లేక పోవడం వల్ల సాంకేతిక సమస్యలు, థర్మల్‌ వైఫల్యాలు తలెత్తే అవకాశాలున్నాయి. వ్యవసాయ ఫీడర్లకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ప్రారంభమైనప్పుడు అనుసంధానమైన మోటార్లు ఒకేసారి ఆన్‌ కావడం వల్ల ప్రారంభ కరెంటు ఒక్కసారి పెరుగుతోంది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ పరికరాల పని తీరును అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అధికారులు అప్రమత్తం..

విద్యుత్‌ డిమాండు పెరుగడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని టీజీఎన్‌పీడీసీఎల్‌ అధికారులు అప్రమత్తమయ్యాఇరు. డివిజనల్‌, సర్కిల్‌, కార్పోరేట్‌ కార్యాలయాల్లో స్థాయిలో 24 గంటల పాటు పని చేసే కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. కార్పోరేట్‌ కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారులను క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు నియమించారు. ప్రతి సర్కిల్‌కు నోడల్‌ అధికారులను నియమించి తెల్లవారు జాము నుంచే సబ్‌ స్టేషన్ల పని తీరును పర్యవేక్షిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురైనప్పుడు ఆలస్యం లేకుండా వాటిని మార్చటం, విద్యుత్‌ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించడం వంటి చర్యలు చేపడుతున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మోబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ఘంగా ఉంచారు. విద్యుత్‌ సమస్యలు తలెత్తినప్పుడు వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ట్రాన్స్‌ఫార్మర్లు వాటి ప్లింత్‌లపై టోల్‌ ఫ్రి నంబరు 1912ను ముద్రించారు. పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు టీజీఎన్‌ఫీడీసీఎల్‌ 2023 డిసెంబరు నుంచి 2026 సెప్టెంబరు వరకు విద్యుత్‌ మౌలిక సదుపాయాల బలోపేతంపై దృష్టి సారించింది. ఈ కాలంలో 132/33 కేవీ సామర్థ్యంతో ఒక సబ్‌ స్టేషన్‌, 56 కిలో మీటర్ల 33 కేవీ విద్యుత్‌ లైన్లు, 88 కిలో మీటర్ల ఎల్‌టీ లైన్లు, 354 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 14 వపర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను అదనంగా ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడదించారు. అలాగే మంజూరైన తొమ్మిది కొత్త 33/11 కేవీ సబ్‌ స్టేషన్లలో మూడింటి నిర్మాణ పనులు పురోగతి ఉండగా, మిగిలిన ఆరు సబ్‌ స్టేషన్లు టెండర్‌ దశలో ఉన్నాయి.

- సాంకేతిక సమస్య..

ఒక ఫీడర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినా లేదా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రత్యామ్నాయ ఫీడర్‌ ద్వారా సరఫరా అందించేందుకు 33 కేవీ ఇంటర్‌ లింకింగ్‌ లైన్లు కీలకంగా పని చేస్తాయి. ఈ విధానం ద్వారా ఒక ఫీడర్‌పై ఉన్న లోడ్‌ను మరో ఫీడర్‌కు బదిలి చేయవచ్చు. జిల్లాలో తొమ్మిది ఇంటర్‌ లింకింగ్‌ లైన్లకు సంబఽంధించి మొత్తం 56 కిలో మీటర్లు పనులు పూర్త అయ్యాయి. దీంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.వచ్చే వేసవి విద్యుత్‌ వినియోగం మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టీజీఎన్‌ఫీడీసీఎల్‌ అధికారులు ముందస్తు కార్యచరణ ప్రణాళిక రూపొందించారు. 2027 వేసవిని లక్ష్యంగా చేసుకొని తొమ్మిది సబ్‌ స్షేన్లు, ఎనిమిది పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 222 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, నాలుగు కెపాసిటర్‌ బ్యాంకుల ఏర్పాటుకు ప్రణాళిక చేపట్టారు. ఈ పనులు పూర్తి అయితే విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు గిరిష్ట డిమాండు సమయంలో సరఫరా విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది.

పెరిగిన విద్యుత్‌ వినియోగం..

- ఉత్తమ్‌ జాడే, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ

జిల్లాలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే 2026 అక్టోబరులో విద్యుత్‌ వినియోగం 19.25 శాతం పెరిగింది. విద్యుత్‌ సరఫరా సామర్థ్యం పెరుగటంతో పాటు స్థానికంగా పెరుగుతున్న లోడ్‌ సమర్థంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే వేసవి విద్యుత్‌ వినియోగం మరింత పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని 2027 వేసవిని లక్ష్యంగా చేసుకొని తొమ్మిది సబ్‌ స్షేన్లు, ఎనిమిది పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 222 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, నాలుగు కెపాసిటర్‌ బ్యాంకుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.

Updated Date - Oct 14 , 2026 | 10:19 PM