Share News

కరువు.. కుంభవృష్టి

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:14 AM

దేశ వ్యవసాయ రంగాన్ని ఎల్‌నినో చుట్టుముడుతోంది. దేశానికి అత్యధిక వర్షాలు అందించే నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి.

కరువు.. కుంభవృష్టి

  • ఎల్‌నినోతో దేశంలో మారుతున్న వాతావరణం

  • సాధారణం కంటే ఈ ఏడాది తక్కువ వర్షపాతం

  • ఇప్పటికే బలహీనపడిన నైరుతి రుతుపవనాలు

  • కొన్నిచోట్ల ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసే అవకాశం

  • తెలంగాణలోనూ అదే పరిస్థితి

  • పంటల దిగుబడి తగ్గి ఆహార ధాన్యాలకు కొరత!

  • పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడింది: జపాన్‌

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యవసాయ రంగాన్ని ఎల్‌నినో చుట్టుముడుతోంది. దేశానికి అత్యధిక వర్షాలు అందించే నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. వచ్చిన తర్వాత కూడా వేగంగా విస్తరించటం లేదు. రెండుమూడేళ్లకోసారి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పటం సర్వసాధారణమే అయినా.. ఈసారి వచ్చేది సూపర్‌ ఎల్‌నినో అని, దాని ప్రభావం దారుణంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దేశంలోని చాలా భాగం తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడుతాయని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి తక్కువ సమయంలో కుంభవృష్టి కురిసి వరదలు వస్తాయని అంటున్నారు. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని పేర్కొంటున్నారు. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరిత ల ఉష్ణోగ్రతలు తక్కువసమయంలో ఒకటిరెండు డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడెక్కడటం వల్ల భూమధ్యరేఖా మండలంలో తూర్పు నుంచి పశ్చిమానికి స్థిరంగా వీచే సముద్ర వ్యాపార పవనాలు బలహీనడటం లేదా తిరోగమించటమే ఎల్‌నినో. దక్షిణాసియాకు అత్యధిక వర్షాలనిచ్చేది ఈ పవనాలే. అవి బలహీనపడటంవల్ల భారతదేశ రుతుపవన వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. సమయానికి వర్షాలు పడవు. ఒక వర్షానికి మరో వర్షానికి మధ్య ఉండే విరామ కాలం సుదీర్ఘంగా ఉంటుంది. దీంతో వాతావరణం పొడిగా మారి పంటలు ఎండిపోతాయి. కొన్నిచోట్ల ఉన్నట్లుండి కుంభవృష్టి కురుస్తుంది. దీనివల్ల ఆకస్మికవరదలు వస్తాయి. అంటే దేశంలో ఒకప్రాంతం నీట మునిగితే మరోప్రాంతం కరువుతో అల్లాడుతుందన్నమాట. ఈసారి మనదేశంలో ఇలాంటిపరిస్థితులే కనిపించనున్నాయని నిపుణులు చెబుతున్నారు.


పసిఫిక్‌లో పుట్టిన ప్రమాదం

ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడి అత్యధిక రాష్ట్రాల్లో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయని భారత వాతావరణ విభా గం ఇప్పటికే ప్రకటించింది. మధ్య, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షా లు కురుస్తాయని పేర్కొంది. సాధారణ వర్షపాతంలో దాదాపు సగమే ఉండవచ్చని అంచనా వేసింది. మనదేశంలో వ్యవసాయ రంగం ఇప్పటికీ దాదాపు 50ు రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది. ఎల్‌నినో ప్రభావంపై త్వరలో ప్రకటన చేస్తామని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. మరోవైపు ఎల్‌నినో ఇప్పటికే ఏర్పడిందని జపాన్‌ వాతావరణ సంస్థ బుధవారం వెల్లడించింది. వ్యవసాయం, ఇంధనం, రవాణా, ఆహార వ్యవస్థలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపనున్న ట్టు ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్‌) హెచ్చరించింది. వర్షపాతం తగ్గితే పంట దిగుబడులు తగ్గి ఆహార సరఫరాను ప్రభావితం చేస్తుంది. అది నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణమవుతుంది. నదులు, రిజర్వాయర్లలో నీటి నిల్వ లు తగ్గి తాగునీటికి కొరత ఏర్పడనుంది. జలవిద్యుత్‌ ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతుంది. అధిక వేడి వల్ల ఫ్యాన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వినియోగం పెరిగి, విద్యుత్‌ నెట్‌వర్క్‌లపైనా ఒత్తిడి పెరగనుంది. అయితే, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఐవోడీ (ఇండియన్‌ ఓసియన్‌ డైపోల్‌) సానుకూలంగా మారి రుతుపవనాలను బలోపేతం చేస్తుందని ఆస్ట్రేలియా వాతావరణ సంస్థ తెలిపింది.

తెలంగాణపై భారీగానే ప్రభావం

తెలంగాణలో జూన్‌ ప్రారంభంలో వర్షాలు ఉన్నా, తర్వాత తీవ్ర పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తం రుతుపవన కాలంలో 50 శాతం సాధారణ వర్షాలుంటే, మిగిలిన 50 శాతం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. జూన్‌, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం ఉంటుందని, సెప్టెంబర్‌లో లోటు ఉంటుందని అంటున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలోనూ ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, వరంగల్‌, జనగాం, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్‌, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాధారణ వర్షపాతం ఉంటుందని, మిగిలిన అన్ని జిల్లాల్లో లోటు ఉంటుందని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువవర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మధ్య కోస్తాంధ్రలో ఎండల తీవ్రత పెరగడం, వడగాలులు, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.


అల్పపీడనాలు ఏర్పడవు

ఎల్‌నినో కారణంగా ఈసారి రాష్ట్రంలో సాధారణ వర్షపాతంలో 75 శాతం వరకే నమోదయ్యే అవకాశం ఉంది. జూలై, ఆగస్టు నెలల్లో అల్పపీడనాలు ఏర్పడితే వందశాతం వర్షపాతం నమోదవుతుంది. కానీ, ఎల్‌నినో కారణంగా అల్పపీడనాలు ఏర్పడవు. సాధారణంగా అల్పపీడనాలు లేకుంటే రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎల్‌నినో ప్రభావం సెప్టెంబరు వరకు ఉంటుంది.

- నరేందర్‌, వాతావరణ శాస్త్రవేత్త, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

ఈసారి 60 శాతం వర్షాలే

తెలంగాణలో సగటు వర్షపాతం 743 మిలీమీటర్లు. ఈ ఏడాది ఇందులో 50-60 శాతమే నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్‌నినోతో నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. అధిక పొడి వాతావరణం కారణంగా కొన్నిసార్లు ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయి. ఎల్‌నినోతో మొత్తానికే వర్షాలు పడకపోవడం అంటూ ఉండదు.

- బాలాజీ, వాతావరణ నిపుణుడు

Updated Date - Jun 11 , 2026 | 05:14 AM