kumaram bheem asifabad-ఎల్‌నినో ముప్పు
ABN , Publish Date - Jul 21 , 2026 | 10:29 PM
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది భారీ వర్షాలు లేక పోవడంతో వ్యవసాయాధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్‌నినో ఖరీఫ్ ఆశలను గల్లంతు చేస్తున్నది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వానా కాలం సాగు ముందుకు సాగడం లేదు. వరి, పత్తి సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. 45 శాతం లోటు వర్షపాతంతో భూగర్భజలాలు అడుగం టుతున్నాయి.
- పంటలపై తీవ్ర ప్రభావం
- లోటు వర్షపాతంతో పడిపోతున్న భూగర్భ జలాలు
- ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలని అధికారుల సూచన
కాగజ్‌నగర్ టౌన్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది భారీ వర్షాలు లేక పోవడంతో వ్యవసాయాధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్‌నినో ఖరీఫ్ ఆశలను గల్లంతు చేస్తున్నది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వానా కాలం సాగు ముందుకు సాగడం లేదు. వరి, పత్తి సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. 45 శాతం లోటు వర్షపాతంతో భూగర్భజలాలు అడుగం టుతున్నాయి. రాబోయే రోజుల్లో తాగునీటికి తీవ్ర సమస్య తప్పదనే ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. కాలంపైనే భారం వేసి ఉన్న కొద్దిపాటి భూగర్భ జలాలతో నాట్లేసు కున్న పొలాలకు నీరందడం లేదు.
- పత్తి మొక్కలు సైతం..
సరైన వర్షాలు లేకు పోవడంతో పత్తి మొక్కలు సైతం వడలిపోతున్నాయి. కొద్దిరోజుల్లో వర్షం కురవకపోతే వాటి పై కూడా ఆశలు వదులుకోవలసిందే.. ఆశించిన స్థాయిలో వర్షాలు పడక పోవడంతో ఏ పంటలు వేయాలనే ఆందో ళనలో రైతులున్నారు. ఎలాంటి పంటలు వేయాలో తెలియ క రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వ్యవసాయాఽ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకు కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. లోటు వర్ష పాతం ఉండడంతో వరి పంటలు వేయవద్దని కేవలం ఆరుతడి పంటలు వేయాలని, దీంతో కూరగా యలు కంది, పెసర, జొన్న తదితర పంటలు వేయాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. వర్షాల కోసం ఎదురు చూడకుండా ఆ ప్రాంతంలోని భూమిని పట్టి పంటను మార్చుకుంటే నష్టాలు చెందకుండా ఉంటాయని అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.
- అనువైన నేలల్లో..
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కూరగాయల పంటలు మేలు చేస్తాయని జిల్లాలో కూరగాయల పంటలు పండించేందుకు అనువైన నేలలు ఉండడంతో ఆ వైపు కూడా రైతులు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ఎల్నీనో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం తక్కుగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉద్యాన వన పంటలతో పాటు ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ పంటలు వేసి లాభాలు గడించాలని సూచనలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల పంటలు ఏటా పండుతాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. పత్తి 3.60 లక్షల ఎకరాలు, వరి 50వేల ఎకరాలు, కంది, పెసర, ఇతర కూరగాయాలతో కలిపి మొత్తంగా 5లక్షల ఎకరాల వరకు ఉంటాయి. వర్షాలు ఆలస్యంగా కురుస్తుం డడంతో పొలాల్లో వేసిన పత్తి మొలకలు చని పోతున్నా యి. దీంతో సంప్రదాయ పంటల స్థానంలో ఆరుతడి పంటలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు.
- వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో..
జిల్లా వ్యాప్తంగా.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కు ఆరుతడి పంటలు ఇతరాత్ర వేయాల్సిన పంటలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాకాలం ఆరంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు సిర్పూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రైతులు పత్తి పంటను వేశారు. గత వారం రోజులుగా వర్షాలు కురియక పోవటంతో పత్తి పంట ఏపుగా వచ్చినప్పటికీ ఎదుగుల లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. వర్షాలు కురిస్తే తప్పా తమ పంటలు చేతికి రావని లేకుంటే ఈ సారి అపార నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు దిగాలు చెందుతున్నారు. అలాగే వరి పంట సాగు చేసే రైతులకు నిరాశే మిగిలింది. విస్తారంగా వర్షాలు కురువక పోవడంతో వరి పంట సాగు చేసేందుకు రైతులు ఎవరు కూడా ముందుకు రాలేదు. కేవలం బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు మాత్రమే వరి పంటను సాగు చేస్తున్నారు. మిగితా రైతులంతా కూడా ఈ సారి వరి వేయకుండా వదిలేశారు.
తగ్గిన వర్షపాతం..
-రామకృష్ణ, వ్యవసాయాధికారి, కాగజ్‌నగర్
ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి వర్షపాతం పూర్తిగా తగ్గింది. జిల్లా వ్యాప్తంగా రైతులకు వరి పంట వేయవద్దని సూచిస్తున్నాం. ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాల్లోని వివిధ గ్రామా ల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.. పత్తి పంట ఎదుగుల లేక పోవడం, చీడ పీడ నివారణకు కూడా తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. ఆరుతడి పంట ల ప్రయోజనం కూడా ఉంది. తక్కువ సమయంలోనే పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంది.