Share News

ప్రోరేటా మేరకు నదీ జలాలు అందాలి

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:45 AM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయన్న వాతావారణశాఖ అంచనాల నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

ప్రోరేటా మేరకు నదీ జలాలు అందాలి

  • ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల అంశంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి

  • డ్యామ్‌ల వారీగా నీటి విడుదలకు కార్యాచరణపై చర్చించాలి

  • జలాశయాల గేట్ల మరమ్మతులు వెంటనే పూర్తిచేయాలి

  • వర్షాకాల సన్నద్ధతపై సమీక్షలో సీఎం ఎ.రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయన్న వాతావారణశాఖ అంచనాల నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా జలాలు పక్కాగా దక్కేలా చూడాలని స్పష్టం చేశారు. ఎగువ రాష్ట్రాలు డ్యాములన్నీ నింపుకొన్నాకే.. దిగువకు నీళ్లు వదిలితే మనకు ఇబ్బందులు వస్తాయని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటక అధికారులతో ముందుగానే చర్చించి.. అంతర్రాష్ట్ర జలాల్లో ప్రొరేటా ప్రకారం తెలంగాణకు అందేలా తగిన కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలోని కోయినా డ్యామ్‌ నీటిని ఆ రాష్ట్రం పూర్తిగా జల విద్యుదుత్పత్తికే వినియోగిస్తోందని.. ఆ నీరంతా తెలంగాణకు ఇచ్చేలా, బదులుగా తెలంగాణ నుంచి విద్యుత్‌ ఇచ్చేలా చర్చించాలని సీఎస్‌ రామకృష్ణారావుకు సూచించారు. వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

వరదల సద్వినియోగంపై దృష్టిపెట్టండి

గోదావరి నది నుంచి ఏటా వేల టీఎంసీల జలాలు సముద్రం పాలవుతున్నాయని.. కానీ వరదంతా స్వల్ప కాలంలోనే వస్తోందని సీఎం గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇటు గోదావరి, అటు ప్రాణహిత వైపు నుంచి వచ్చే వరదను ఎలా మళ్లించాలనే దానిపై స్పష్టమైన విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్మించిన సీలేరు, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి ఉత్పత్తవుతున్న విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన వాటాపై నివేదిక రూపొందించాలని విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. గతంలో కడెం ప్రాజెక్టు వద్ద తలెత్తిన ఇబ్బందులను గుర్తు చేశారు. వాతావరణశాఖ అంచనాలు, నివేదికల ఆధారంగా రాష్ట్రంలో పంటలసాగుపై నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పంటల మార్పిడి, పంటల వైవిధ్యత, తక్కువ నీరు వినియోగించుకునే పంట రకాల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తయ్యే యూరియా అంతా తెలంగాణకే కేటాయించేలా కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు.


విపత్తులపై తక్షణమే స్పందించాలి

గత ఏడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీల అమలుపై సీఎం ఆరాతీశారు. హామీల అమల్లో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు. వరదల సమయంలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతుల కోసం విపత్తు నిర్వహణశాఖ వద్ద ఉన్న రూ.1,000 కోట్ల నిధులను వినియోగించుకోవాలని సూచించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోడ్లపై వరదనీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని..నీరు నిలిచే 141ప్రదేశాల్లో వాటర్‌ హార్వెస్టింగ్‌ వెల్స్‌ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లా, రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్థిశాఖలు సమన్వయంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

మానవత్వంతో వ్యవహరించాలి!

విపత్తులతో ప్రాణ, ఆస్తినష్టం జరిగిన కుటుంబాలకు సకాలంలో పరిహారం అందించకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది భారీ వర్షాలు, వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో బాధితులకు ఇచ్చిన హామీల అమలు ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లినప్పుడు అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలి. కానీ నెలలు గడుస్తున్నా పరిహారం అందించకపోవడం ఏమిటి? కనీస మానవత్వం లేదా? తగిన సమయంలో పరిహారం అందిస్తే బాధిత కుటుంబాలకు ఉపశమనం కలుగుతుంది. మరోసారి నిర్లక్ష్యంగా వహించవద్దు’’ అని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక హైదరాబాద్‌ నగరంలో రోడ్లపై నీరు నిల్వకుండా వాటర్‌ హర్వెస్టింగ్‌ వెల్స్‌ నిర్మాణంలో నిర్లక్ష్యంపైనా సమీక్షలో మండిపడినట్టు తెలిసింది. ‘‘నేను చెప్పిన 11 ప్రాంతాలు తప్ప.. ఇంకెక్కడా వాటర్‌ హార్వెస్టింగ్‌ ఏర్పాటుచేయాలనే ఆలోచన రాలేదా. అందుకు అవకాశం ఎక్కడా లేదా?’’ అని ప్రశ్నించినట్టు సమాచారం.

Updated Date - Jun 02 , 2026 | 04:45 AM