చలికాలంలో గరిష్ఠస్థాయికి ఎల్‌నినో ఉధృతి
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:55 AM
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుందని..
భారీగా పెరగనున్న హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు
వర్షాకాలంలో బంగాళాఖాతం అల్లకల్లోలం
తగ్గనున్న చేపలు.. తీరప్రాంతాల కోత
తూర్పు తీరంలో వరదలు వచ్చే ప్రమాదం
ఎల్‌నినోపై ఇన్‌కాయి్‌స తొలి బులెటిన్‌ను విడుదల చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడనుందని.. చలికాలంలో దాని ఉధృతి గరిష్ఠంగా ఉండనుందని ‘భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం(ఇన్‌కాయి్‌స) హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావ తీవ్రత గురించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక బులెటిన్‌లు విడుదల చేయాలని నిర్ణయించిన ఇన్‌కాయి్‌స.. తొలి బులెటిన్‌ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసింది. సముద్రాలతోపాటు పర్యావరణంపై ఎల్‌నినో ప్రభావం ఏ మేరకు ఉండనుందో ఎప్పటికప్పుడు ఈ బులెటిన్ల ద్వారా తెలుపుతామని ఇన్‌కాయి్‌స ప్రతినిధులు పేర్కొన్నారు. వారు విడుదల చేసిన తొలి బులెటిన్ ప్రకారం.. ఎల్‌నినో తీవ్రత పెరుగుతూ పోయి శీతాకాలంలో దాని ఉధృతి గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. ముఖ్యంగా నవంబర్ 2026-జనవరి2027 మధ్య ఈ తీవ్రత కనిపించనుందని అంచనా. ఫలితంగా హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని.. ఏప్రిల్/మే 2027 వరకూ ఇలాగే ఉండవచ్చని ఇన్‌కాయి్‌స వెల్లడించింది. 2027 మార్చి-మే నెలల నడుమ అరేబియా సముద్రంలో, బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతల ఒత్తిడి (థర్మల్ స్ట్రెస్) అధికంగా ఉంటుందని.. దానివల్లపగడపు దిబ్బలు మరింతగా నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్రజలాలు వేడెక్కడం వల్ల చేపల దిగుబడి తగ్గవచ్చని, మరీముఖ్యంగా సార్డిన్ (కవ్వలు), మకరెల్(కనగర్త)వంటి రకాల చేపల లభ్యత తగ్గవచ్చని వెల్లడించింది. సముద్ర వాతావరణం మారడం వల్ల ఈ చేపల ఎదుగుదలపై కూడా ప్రభావం పడి అవి మంచి పరిమాణాల్లో (సైజుల్లో) లభించే అవకాశాలు కూడా తగ్గవచ్చని పేర్కొంది. అలాగే..మనదేశానికి వర్షాలను మోసుకొచ్చే నైరుతి రుతుపవనాల వేగం, బలం ఎల్‌నినో ప్రభావం వల్ల తగ్గిపోతాయని నివేదిక హెచ్చరించింది. వర్షాకాలంలో సముద్రంవైపు నుంచి తేమతో కూడిన బలమైన గాలులు భూభాగం వైపు వీస్తాయి. ఎల్‌నినో వల్ల ఆ గాలులు బలహీనపడడం వల్ల సముద్రం నుంచి తగినంత తేమను భూభాగంపైకి మోసుకురాలేవు. ఫలితంగా దేశంలో వర్షాల పరిమాణం తగ్గుతుంది. వర్షాలు సకాలంలో పడవు. లేదా తగినంతగా పడవు. దానివల్ల భూమిలో తేమ శాతం తగ్గుతుందని, తద్వారా పంటల దిగుబడి కూడా తగ్గుతుందని.. మరీ ముఖ్యంగా వరి, పప్పుదాన్యాల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడవచ్చని, తీవ్రమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు పడిపోవచ్చని ఇప్పటికే ఆ ప్రభావం మన నగరం మీద కనిపిస్తోందని విశ్రాంత ఆచార్యులు గోపి తెలిపారు.
బంగాళాఖాతం అల్లకల్లోలమే..?
ఎల్‌నినో ప్రభావం భారతదేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో భిన్నంగా ఉండబోతోందని నివేదిక పేర్కొంది. దానిప్రకారం.. ఈ వర్షాకాలంలో బంగాళాఖాతంలో అల్లకల్లోల పరిస్ధితులు ఏర్పడనున్నాయి. తీరప్రాంతాలు కోతకు గురయ్యే, భారతదేశపు తూర్పు తీరంలో వరదలు వచ్చే ప్రమాదం ఉంది. అరేబియా సముద్రం మాత్రం గతంతో పోలిస్తే మరింత ప్రశాంతంగా ఉంటుందని తెలిపింది. వర్షాకాలంలో పశ్చిమ తీరప్రాంతపు కోత తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. ఎల్‌నినో సమయాల్లో సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా పెరగడం వల్ల.. నీటిపొరల విభజన ఇంకా బలపడుతుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే.. సముద్రంలో నీటి సాంద్రత అన్నిచోట్లా ఒకేలా ఉండదు. ఉష్ణోగ్రత, ఉప్పు శాతాన్ని బట్టి సముద్రపు నీరు వేర్వేరు పొరలుగా విడిపోతుంది. తేలికగా ఉండే వేడి నీరు పై భాగంలోకి ఉంటే.. బరువైన చల్లని నీరు కింది భాగంలో ఉంటుంది. ఎల్‌నినో వల్ల ఈ విభజన మరింత బలపడుతుంది. ఫలితంగా కింద ఉండే పోషకాలు పైకి రాక.. చేపలు, సముద్రపు మొక్కలకు సరైన పోషకాలు అందవు. అదే సమయంలో.. వాతావరణం నుంచి వచ్చే ఆక్సిజన్ సముద్రంలోని పైపొరలకే పరిమితమై.. కింది భాగంలో ఉండే సముద్ర జీవుల మనుగడ కష్టమవుతుంది.
మెరైన్ హీట్‌వేవ్స్...
ఎల్‌నినో కారణంగా మెరైన్ హీట్‌వేవ్స్ ప్రమాదం పొంచి ఉంటుందని ఇన్‌కాయి్‌స తన బులెటిన్‌లో పేర్కొంది. ఎండాకాలంలో వడగాలులు ఎలా ఉంటాయో.. సముద్రంలో కూడా అలా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయినప్పుడు మెరైన్ హీట్‌వేవ్స్ ఏర్పడతాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రత ఒక ప్రాంతంలో సాధారణం కంటే చాలా ఎక్కువగా.. ఐదురోజులు అంతకుమించి ఉంటే దాన్ని మెరైన్ హీట్‌వేవ్ (సముద్రపు వడగాలి)గా భావిస్తారు. ఇవి భూమిపై వీచే వడగాలుల కంటే ప్రమాదకరం. ఎందుకంటే సముద్ర జీవులు హఠాత్తుగా పెరిగే ఈ వేడిని తట్టుకోలేవు. ముఖ్యంగా పగడపు దిబ్బలు విపరీతంగా దెబ్బతింటాయి. సముద్రపునాచు లేదా శైవలాలు అసాధారణంగా పెరిగిపోయి... అవి నీటిలోని ఆక్సిజన్‌ను పీల్చేసుకోవడం వల్ల చేపలకు ఊపిరి ఆడక చనిపోతాయి. బతికి ఉన్న చేపలు తమకు అనుకూలంగా ఉండే వేరే ప్రాంతాలకు వెళ్లిపోతాయి. ఫలితంగా చేపల వేటపై తీవ్రంగా దెబ్బపడుతుంది. కాగా.. ఇన్కాయిస్ తమ తరువాత బులెటిన్‌ను జూలై రెండోవారంలో విడుదల చేయనుంది.