యాసంగి సాగూ కష్టమే!
ABN , Publish Date - Jul 22 , 2026 | 06:32 AM
వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు మున్ముందు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు! ఇప్పటికే ఖరీఫ్ సాగును ప్రశ్నార్థకం చేసిన ఎల్‌నినో, వచ్చే ఏడాది మార్చి దాకా ఉంటుందని, తద్వారా యాసంగి సాగునూ అది దెబ్బతీసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సెప్టెంబరు-డిసెంబరులో ఎల్‌నినో తీవ్రరూపం.. వచ్చే మార్చి వరకు ఆ ప్రభావమే
కొన్నిచోట్ల వానలు పడ్డా మొత్తంగా తక్కువ వర్షపాతమే
వరి, చెరకు పంటలు వేయొద్దు ఆరుతడి పంటలే మేలు
కూరగాయల పంటలు వేయండి యూనిట్‌కు రూ.10 ఇచ్చినా
విద్యుత్తు దొరికే పరిస్థితి లేదు అన్నదాతలు విద్యుత్తు పొదుపు పాటించాలి: నిపుణులు
హైదరాబాద్, జులై 21 (ఆంధ్రజ్యోతి): వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు మున్ముందు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు! ఇప్పటికే ఖరీఫ్ సాగును ప్రశ్నార్థకం చేసిన ఎల్‌నినో, వచ్చే ఏడాది మార్చి దాకా ఉంటుందని, తద్వారా యాసంగి సాగునూ అది దెబ్బతీసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆగస్టులో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నా.. సెప్టెంబరులో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఇది డిసెంబరు దాకా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా చెప్పారు. జూన్‌లో మొదలైన ఎల్‌నినో ప్రభావం అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో తీవ్రంగా ఉండనుందని.. వచ్చే ఏడాది మార్చి దాకా కొనసాగుతుందని జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్‌కాయి్‌స) శాస్త్రవేత్త విజయ్ హెచ్చరించారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల, వర్షపాతం తగ్గుతుందని విశ్లేషించారు. ఫలితంగా ఎల్‌నినో ప్రభావం కారణంగా అక్టోబరుతో ప్రారంభమై జవవరి దాకా సాగే యాసంగి సాగు పనులూ ప్రశ్నార్థకంగా మారాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. రాష్ట్ర ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ‘పసిఫిక్ మహా సముద్రం వేడెక్కటం నుంచి తెలంగాణ సన్నద్ధత వరకు’ అనే అంశంపై సెమినార్ జరిగింది. ఇందులో పలువురు శాస్త్రవేత్తలు ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అక్కడక్కడ, అప్పుడప్పుడు భారీ వర్షాలు పడ్డా కూడా ఇవి సీజన్ మొత్తంపడే అవకాశంలేదని, అన్నదాతలు తొందరపడి నీటి అవసరం ఎక్కువుండే పంటలు వేయొద్దని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలు పడిపోతాయని, చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి, చెరకు లాంటి పంటలు సాగుచేయొద్దని రైతులకు బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ మృత్యుంజయరెడ్డి విజ్ఞప్తిచేశారు.
చిరుధాన్యాలు, నూనెగింజల వంటి ఆరుతడి పంటలు సాగు చేయడం మేలని సూచించారు. బోరుబావుల కింద కూడా వరిసాగు చేయొద్దని తెలంగాణ రాష్ట్ర ఉద్యా న విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ దండా రాజిరెడ్డి సూచించారు. రాష్ట్రంలో కూరగాయల పంటలు వేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం పట్టణ ప్రాంతాలపై కూడా పడుతుందని ఆర్థిక, సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్) ప్రొఫెసర్ జీనా టి. శ్రీనివాసన్ అన్నారు. పశుగ్రాసం, పశుసంరక్షణ చర్యలు చేపట్టాలని, రైతులు, కూలీలు, కౌలు రైతులకు రుణాలు, ప్రభుత్వసాయం వేగంగా అందేలా చూడాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 16న విద్యుత్తు గరిష్ట డిమాండ్ 16,650 మెగావాట్లకు చేరిందని, ఆ ప్రకారంగా విద్యుత్తు డిమాండ్ 7.8 శాతం పెరిగిందని ట్రాన్స్‌కో సీఈ సురేశ్ బాబు తెలిపారు. శ్రీశైలం నుంచి ఆశించిన స్థాయి లో జల విద్యుదుత్పత్తి జరగదని, నిరుటితో పోలిస్తే 78.8 శాతం తగ్గిందన్నారు. ఆగస్టు- అక్టోబరు నెలల్లో పీక్ అవర్స్‌లో ప్రతి నెలా 4.200 - 5,500మెగావాట్ల కొరత ఏర్పడుతుందన్నారు. యూనిట్‌కు రూ.10 ఇచ్చినా విద్యుత్తు లభించే పరిస్థితులు లేవని, రైతులు పొదుపు పాటించాలని సూచించారు. కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తితోపాటు, ఇతర పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ జోసెఫ్ తెలిపారు. జూలైలో 47 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ఆగస్టు మొదటి వారానికే ముందస్తు కరువు ప్రకటనపై పరిశీలన చేయాలని, అన్ని గ్రామాలకు పంటల బీమా కల్పించాలని కోరారు.