Share News

ధాన్యంపై ఎల్‌నినో ప్రభావం

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:20 AM

మార్కెట్లలో పంట ఉత్పత్తుల ధరలపై ఎల్‌నినో బాగా ప్రభావం చూపుతోంది. రాబోయే ఖరీ్‌ఫలో ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారంతో..

ధాన్యంపై ఎల్‌నినో ప్రభావం

  • మార్కెట్‌లో ధరలకు రెక్కలు.. కేసముద్రంలో రికార్డు రేటు

  • ఆర్‌ఎన్‌ఆర్‌ రకానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.2,906

  • మక్కలకూ భారీ ధర!.. వరంగల్‌లో క్వింటా రూ.2,265

  • జాడలేని మేఘాలు!.. దేశంలో 65శాతం లోటు వర్షపాతం

  • జూలై వరకు ఇలాగే ఉంటే సాగుకు కటకటే

  • రాష్ట్రంలో పలుచోట్ల 42- 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు

కేసముద్రం, వరంగల్‌ వ్యవసాయం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : మార్కెట్లలో పంట ఉత్పత్తుల ధరలపై ఎల్‌నినో బాగా ప్రభావం చూపుతోంది. రాబోయే ఖరీ్‌ఫలో ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారంతో వ్యాపారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన పంట అయిన ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యానికి విపరీతమైన డిమాండ్‌ ఉంటుందనే అంచనాతో మార్కెట్లో దాని ధర పెంచారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ఈ ధాన్యం ధర ఈ సీజన్‌లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906గా నమోదైంది. గత 15 రోజులుగా ఈ మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వడ్ల ధర రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. స్థానిక మార్కెట్‌కు బుధవారం 11 మంది రైతులు 274 బస్తాల్లో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యాన్ని తీసుకురాగా ‘ఎలకా్ట్రనిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌’(ఈ-నామ్‌) విధానంలోని ‘ఈ-వేలం’లో క్వింటాకు గరిష్ఠంగా రూ.2,906, కనిష్ఠంగా రూ.2,226, సగటున రూ.2,589 ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) క్వింటాకు రూ.2,389 ఉండగా ఈ సీజన్‌లో అంతకంటే ఎక్కువగానే మార్కెట్లో ధరలు పలికాయి.


సరఫరా తగ్గుతుందనే...

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండి రాబోయే రోజుల్లో మార్కెట్‌కు ధాన్యం సరఫరా తగ్గుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ధాన్యం నిల్వ చేసేందుకు మార్కెట్లో కొనుగోళ్లు పెంచారు. ఫలితంగా ధాన్యానికి డిమాండ్‌ ఏర్పడడంతో ఇక్కడి మార్కెట్లో ఈ సీజన్‌లో గత 15 రోజులుగా సగటు ధర పెరుగుతూ వస్తోంది. ఈ నెల 1న ధాన్యం సగటు ధర రూ.2,475 నుంచి రూ.2,495 వరకు ఉంది. ఆ తర్వాత ఈ నెల 4న సగటు ధర రూ.2,589, 5న రూ.2,636, 8న రూ.2,689, 9న రూ.2,729గా నమోదయ్యాయి. తాజాగా గరిష్ఠ ధర రూ.2,900 మార్కు దాటడం విశేషం. అయితే రైతులు రబీకి సంబంధించిన ధాన్యాన్ని చాలా వరకు విక్రయించారు. కొంతమంది మాత్రం తమ ఇళ్లలోనే నిల్వ పెట్టుకున్నారు. అలాంటి రైతులకు ఇప్పటి ధరలు సిరులు కురిపిస్తున్నాయి. మరోవైపు వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలకూ ఆల్‌టైం రికార్డు ధర నమోదైంది. బుధవారం క్వింటాకు రూ.2,265 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. గత ఏప్రిల్‌, మే నెలల్లో క్వింటాకు రూ.700 నుంచి 2,000లోపే కొనుగోలు చేశారు. అలాంటిది బుధవారం ఏకంగా రూ.2,265 ధర పెట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారులు ముందు జాగ్రత్తలో భాగంగా మక్కలను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వానాకాలం సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో పంటలు తక్కువగా పండే అవకాశం ఉందని, ఇప్పుడే కొని నిల్వ చేసుకుని ధర పెరిగిన తరువాత అమ్ముకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


  • వానాకాలంలో వేసవి మంటలు

  • పలుచోట్ల 42- 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు

  • సూర్యాపేట జిల్లా మోతేలో 43.6 డిగ్రీలు

  • మరో 3 రోజులు ఎండలే..

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో దంచి కొట్టాల్సిన వానలకు బదులు మండిపోయే ఎండలు కాస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో 42 నుంచి 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మోతేలో అత్యధికంగా 43.6, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడురోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌ 21 తర్వాత నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గురువారం వడగాలుల ప్రభావం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Updated Date - Jun 18 , 2026 | 05:21 AM