జలవిద్యుత్ ఉత్పత్తిపై ఎల్‌నినో పిడుగు
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:54 AM
ఎల్‌నినో ప్రభావం అప్పుడే కనిపించడం మొదలైంది. వర్షాకాలం మొదలై.. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా వానలు సరిగ్గా కురవకపోవడంతో జలాశయాలకు ...
జలాశయాలకు ఆశించిన స్థాయిలో రాని వరద.. సాగుకు భూగర్భజలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి
వ్యవసాయ విద్యుత్తు వినియోగం పెరిగే అవకాశం
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే ఎండుతున్న బోర్లు
గృహ వినియోగానికి నీటి కొరతతో ఇబ్బందులు
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం అప్పుడే కనిపించడం మొదలైంది. వర్షాకాలం మొదలై.. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా వానలు సరిగ్గా కురవకపోవడంతో జలాశయాలకు ఇన్‌ఫ్లోలు తగ్గిపోయాయి. కోయినా, ఆల్మట్టి, నారాయణపూర్ వంటి జలాశయాలకు ఇప్పటికే వరద ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. ఎల్‌నినో వల్ల పశ్చిమ కనుమల్లో వానలు నిరాశజనకంగానే పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో వరద నీరు రాకపోవడంతో కృష్ణా బేసిన్‌లోని 16 జలాశయాలు, గోదావరి బేసిన్‌లోని 20 జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలన్నీ తాగునీటికే కేటాయించారు. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలంలో నిల్వలు అడుగంటి పోవడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలపై కొంత ప్రభావం ఉండనుంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లోలతో తాగునీటి ఇబ్బందులు తీరుతాయని ఆశిస్తున్నారు. జలాశయాలకు వరద నీరు రాకపోవడంతో.. రైతులు భూగర్భజలాలపై ఆధారపడి అరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది.అదే జరిగితే వ్యవసాయ విద్యుత్తు వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, మున్సిపల్ నీళ్ల వినియోగం 42 శాతంగా ఉండగా... అది ఈ దఫా 45 శాతానికి చేరుతుందని అంచనాలున్నాయి. దాంతో వ్యవసాయ వినియోగంపై నియంత్రణ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే తాగునీటి సరఫరా మందగించింది. బోర్లు ఎండుతుండడంతో గృహ వినియోగానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఏవీ నిరుటి భారీ వర్షాలు..
ఏటా కృష్ణా బేసిన్‌లో జూన్/జూలైలో ప్రాజెక్టులకు వరదలు వస్తుంటాయి. నిరుడు భారీ వర్షాల కారణంగా నిలకడగా ఇన్‌ఫ్లోలు రావడంతో జలవిద్యుత్ ఉత్పత్తి భారీగా (6917 మిలియన్ యూనిట్లు) జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక ఈ 12 ఏళ్లకాలంలో అదే అత్యధికం. కానీ, ఈసారి ఎల్‌నినో దెబ్బకు జలవిద్యుత్ ఉత్పాదనపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి!! కిందటి సంవత్సరం జూన్‌లోనే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. ఈసారి ఇంకా ప్రారంభించలేదు. రిజర్వాయర్లు నిండుగా ఉన్న సమయంలోనూ.. ఎగువ ప్రాంతాల నుంచి నిలకడగా వరద వస్తేనే జలవిద్యుత్ ఉత్పత్తి భారీగా జరుగుతుంది. ఆ సమయంలో బయటి నుంచి కొనుగోళ్లు స్వల్పంగానే ఉంటాయి. జలాశయాల్లో నీటి లభ్యత లేని సమయంలో బయటి నుంచి కొనడం, ధర ఎక్కువైన థర్మల్ విద్యుత్‌ను కొనడం తప్ప.. మరో మార్గం ఉండదు.
కృష్ణాలో ప్రతి చుక్కా విలువైనదే..
గోదావరి బేసిన్‌తో పోల్చితే కృష్ణా బేసిన్‌లో కురిసే ప్రతి చుక్కా జలవిద్యుత్ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే.. మహారాష్ట్రలో కోయినా, కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్, ఆ తర్వాత తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, పాలేరు దాకా ప్రాజెక్టుల వద్ద జలవిద్యుత్ కేంద్రాలున్నాయి. గోదావరిలో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, పెద్దపల్లి మినీ హైడ్రోలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో తొమ్మిది ప్రాజెక్టుల వద్ద 2441 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 11 జలవిద్యుత్ కేంద్రాలుండగా.. వాటిలో2371.6 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాలు కృష్ణా నదిపైనే ఉన్నాయి. గోదావరి ఉప నదులపై 70.2 మెగావాట్ల కేంద్రాలున్నాయి. జలవిద్యుత్ ఉత్పత్తికి స్థిరచార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇంధన చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉత్పత్తి 6 వేల మిలియన్ యూనిట్లు దాటితే.. ఉద్యోగులు, నిర్వహణ ఖర్చుల వల్లే యూనిట్‌కురూ.1.17 దాకా ఖర్చవుతుంది. జల, సౌర విద్యుత్‌లను థర్మల్‌తో కలిపితేనే ధర గిట్టుబాటు అయి... డిస్కమ్‌లపై కొనుగోళ్ల భారం తగ్గనుంది. కానీ, ఈ దఫా వర్షాభావం వల్ల జలవిద్యుత్ ఉత్పాదన 2-3 వేల మిలియన్ యూనిట్ల లోపే ఉంటుందనే అంచనాలున్నాయి. కాబట్టి ఈసారి బహిరంగ విపణిలో కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.