Share News

‘ఎల్‌నినో’ను దృష్టిలో ఉంచుకొని..పంటలు ఎంపిక చేసుకోవాలి

ABN , Publish Date - May 27 , 2026 | 04:18 AM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం ప్రభావంతో ...

‘ఎల్‌నినో’ను దృష్టిలో ఉంచుకొని..పంటలు ఎంపిక చేసుకోవాలి

  • సరిగా సూచనలివ్వని అధికారులపై చర్యలు

  • పంటల అవశేషాలను కాల్చితే జైలు శిక్ష: తుమ్మల

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం ప్రభావంతో యూరియా సరఫరా ఆలస్యం అవుతోంది. వెరసి ఈ ఏడాది రైతులకు గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం ఉన్నది. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయశాఖ అధికారులతో సంప్రదించి పంటలను ఎంపిక చేసుకోవాలి’’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. ఒకవేళ వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి సక్రమంగా సూచనలు ఇవ్వకపోయినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు వరి, పత్తి, మొక్క జొన్న కొయ్యలు, ఇతర పంటల అవశేషాలను కాల్చే విధానాన్ని మానుకోవాలని సూచించారు. పంటల అవశేషాలను కాల్చితే భూసారం దెబ్బ తింటుందని, దిగుబడి తగ్గిపోతుందని, ఏ ఎరువులు వేసినా నేల ఆరోగ్యం మెరుగుపడదని చెప్పారు. అవశేషాలు కాల్చితే భారీ జరిమానాలు విధించటంతోపాటు జైలు శిక్ష కూడా పడుతుందని తెలిపారు.

Updated Date - May 27 , 2026 | 04:18 AM