Share News

ఆన్‌లైన్‌ లావాదేవీలతో చిక్కిన లంచాధికారులు

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:50 AM

వినియోగదారుల నుంచి లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడిన ఎనిమిది మంది అధికారులపై తెలంగాణ దక్షిణ మండల విద్యుత్‌ పంపిణీ ...

ఆన్‌లైన్‌ లావాదేవీలతో చిక్కిన లంచాధికారులు

  • ఎనిమిది మంది ఉద్యోగులపై టీజీఎస్పీడీసీఎల్‌ సస్పెన్షన్‌ వేటు

  • ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): వినియోగదారుల నుంచి లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడిన ఎనిమిది మంది అధికారులపై తెలంగాణ దక్షిణ మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) సస్పెన్షన్‌ వేటు వేసింది. గత 12 ఏళ్లలో ఒకేసారి ఇంతమంది ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం ఇదే ప్రథమం. సస్పెన్షన్‌కు గురైన అధికారులు ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యాప్‌ల ద్వారా లంచాలను తీసుకున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీల ఆధారంగా విచారణలో అడ్డంగా దొరికిపోయారు. దక్షిణ డిస్కమ్‌ అవినీతి నిరోధక సెల్‌(040-2345 4884, 76809 01912)కు అవినీతి ఆరోపణలపై వచ్చిన 90కిపైగా ఫిర్యాదులపై విజిలెన్స్‌ విభాగం విచారణ చేపట్టింది. ఈ విచారణలో 8 మంది అధికారులు లంచాలను ఆన్‌లైన్‌ విధానంలో వసూలు చేసినట్టు తేలింది. దాంతో వారందరినీ సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో భువనగిరి ఆపరేషన్‌ సర్కిల్‌కు చెందిన ఏడీఈ ఆర్‌.ఆనందరెడ్డి(భారత్‌ పెట్రోల్‌ పంప్‌లో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కేంద్రం కనెక్షన్‌ కోసం ఫోన్‌పే ద్వారా రూ.5 వేలు వసూలు చేశారు), గద్వాలలోని శాంతినగర్‌ ఆపరేషన్‌ సర్కిల్‌కు చెందిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ చిన్న సుబ్బరాయుడు(2023 నవంబరు 25న ఫోన్‌పే ద్వారా రూ.25 వేలు లంచం తీసుకున్నారు) ఉన్నారు. అలాగే, సంగారెడ్డి ఆపరేషన్‌ సర్కిల్‌కు చెందిన సబ్‌ ఇంజనీర్‌ జి.మధుసూదన్‌(అవినీతి ఆరోపణలు నిర్ధారణ), యాదాద్రి భువనగిరి చౌటుప్పల్‌కు చెందిన లైన్‌మెన్‌ జిల్లపల్లి శ్రీనివా్‌స(శాఖ అనుమతి లేకుండా 5 హెచ్‌పీల త్రీ ఫేజ్‌ కనెక్షన్‌ కోసం రూ.45 వేలు తీసుకున్నట్లు నిర్ధారణ), గద్వాల అల్వాల్‌పాడ్‌ లైన్‌మెన్‌ షేక్‌ షావలి(రూ.2500ల లంచం తీసుకున్నట్లు నిర్ధారణ), సైబర్‌సిటీలోని జుంటుపల్లి జూనియర్‌ లైన్‌మెన్‌ డప్పు అంజయ్‌(డీటీఆర్‌ మంజూరులో జాప్యం చేసి, డబ్బులు తీసుకున్నారు), హైదరాబాద్‌ సౌత్‌లోని మలక్‌పేట సెక్షన్‌లోని ఆర్టిజన్‌ గ్రేడ్‌-2 మహ్మద్‌ ఖలీల్‌, మేడ్చల్‌లోని భాగ్యనగర్‌ సర్కిల్‌కు చెందిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ షాబాజ్‌అహ్మద్‌ ఉన్నారు. షాబాజ్‌ అహ్మద్‌ అడ్డగుట్టలో అపార్ట్‌మెంట్‌ కనెక్షన్‌ అంచనాల తయారీకి తొలుత రూ.20వేలు, ఆ తర్వాత మరో రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం, లైన్‌ మార్చడానికి మరో రూ.90వేలు డిమాండ్‌ చేసి ఇబ్బందులకు గురిచేసినట్టు తేలింది. ఈ 8మంది సస్పెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులను దక్షిణ డిస్కమ్‌ సీఎండీ ముషారఫ్‌అలీ జారీ చేశారు. సస్పెన్షన్‌ గురైన వారిపై అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో వీరిందరినీ విధు ల నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశం ఉంది.

Updated Date - Feb 20 , 2026 | 01:50 AM