Share News

అండాలు దాచుకుంటున్న అమ్మాయిలు!

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:07 AM

వీరిద్దరే కాదు! ఇటీవలికాలంలో ఇలా రకరకాల కారణాలతో అండాలు నిల్వ చేసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. అండాల నిల్వ (ఎగ్‌ ఫ్రీజింగ్‌)లో అత్యంత కీలకమైన ప్రక్రియ అయిన....

అండాలు దాచుకుంటున్న అమ్మాయిలు!

  • కెరీర్‌ కోసం.. వివాహం ఆలస్యం అవుతుండడమే కారణాలు

  • ఆమె.. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌ స్థాయిలో ఉంది. ఎంఎస్‌ అయ్యే వరకూ పెళ్లి ఊసే వద్దనుకున్న ఆమె.. తరువాత కెరీర్‌పై దృష్టిపెట్టి పెళ్లి వాయిదా వేసింది. మూడు పదుల వయసు దాటిన తరువాత పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ, జాతకాలు కలవకపోవడంతో చాలా సంబంధాలు తప్పిపోతున్నాయి. దీంతో.. ఎందుకైనా మంచిదని ఆమె తన అండాలను భద్రపరుచుకోవడానికి ఓ ఫెర్టిలిటీ క్లినిక్‌ను ఆశ్రయించింది.

  • జాతకంలో దోషం కారణంగా 30 ఏళ్లు దాటినా పెళ్లికాని మరో మహిళ! ఆమెకు పిల్లలంటే అమిత ఇష్టం. అన్నీ కుదిరి పెళ్లయ్యే సమయానికి వయసు ఇంకా మీదపడితే పిల్లలు పుట్టరనే భయంతో రుణం తీసుకుని మరీ తన అండాలను భద్రపరచుకుంది.

..వీరిద్దరే కాదు! ఇటీవలికాలంలో ఇలా రకరకాల కారణాలతో అండాలు నిల్వ చేసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. అండాల నిల్వ (ఎగ్‌ ఫ్రీజింగ్‌)లో అత్యంత కీలకమైన ప్రక్రియ అయిన ‘ఎగ్‌ రిట్రీవల్‌ సైకిల్‌’కు.. క్లినిక్‌ను బట్టి రూ.1.2 లక్షల నుంచి రూ.3.2 లక్షల దాకా ఖర్చవుతుంది. ఆ ప్రక్రియ ద్వారా తీసిన అండాలను భవిష్యత్తులో ఫలదీకరణం చెందించడానికి వీలుగా భద్రపరచడానికి ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.20 దాకా చెల్లించాల్సి ఉంటుంది. ఇంత ఖర్చుకూ వెనుకాడకుండా పలువురు మహిళలు తమ అండాలను భద్రపరచుకుంటున్నారు. తద్వారా కెరీర్‌లో స్థిరపడడం ఆలస్యమైనా.. పెళ్లి కావడం లేటయినా.. పిల్లలు పుట్టే విషయంలో ఏ సమస్యా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ అండాల నాణ్యత, పరిమాణం తగ్గవచ్చని.. అందుకే పలువురు మహిళలు ఎగ్‌ఫ్రీజింగ్‌ వైపు మొగ్గుచూపుతున్నారని హైదరాబాద్‌కు చెందిన ఫెర్టిలిటీ కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఆస్మా తెలిపారు. ఎగ్‌ ఫ్రీజింగ్‌ను భవిష్యత్తుకు బీమాగా చెప్పొచ్చని ఎంబ్రియాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రకాశ్‌ తెలిపారు.


షరతులు వర్తిస్తాయి..

అండాలను శీతలీకరించడం అనేది తమ సంతానోత్పత్తి శక్తిని కాపాడుకోవడానికి చూస్తున్న మహిళలకు ఆకర్షణీయమైన ఎంపిక కనిపిస్తున్నప్పటికీ.. అందుకు వయసు చాలా కీలకమని వైద్యులు చెబుతున్నారు. 25-32 ఏళ్ల వయసులోపే ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేయించుకోవడం మంచిదని.. ఎట్టి పరిస్ధితుల్లోనూ 35 ఏళ్లు దాటనీయొద్దని వారు సూచిస్తున్నారు. 35 ఏళ్లు దాటిన తరువాత అండాల సంఖ్యతోపాటు.. నాణ్యత కూడా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా అండాశయాన్ని ప్రేరేపించడానికి ఇచ్చే హార్మోన్‌ ఇంజెక్షన్ల వల్ల కొందరిలో ఉబ్బరం, భావోద్వేగాలు నియంత్రణలో లేకపోవడం, అరుదుగా కొందరిలో అండాశయ హైపర్‌ స్టిమ్యులేషన్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలు ఉత్పన్నం కకావొచ్చని డాక్టర్‌ ఆరాధ్య తెలిపారు. వీటితోపాటు.. సర్జికల్‌ ప్రమాదాలైన రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్ల ముప్పూ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అలాగే.. శీతలీకరించిన ప్రతి పిండమూ భవిష్యత్తులో పిండంగా మారుతుందని చెప్పడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. 25-32 ఏళ్ల లోపు ఎక్కువ అండాలను నిల్వ చేసినప్పటికీ సక్సెస్‌ రేటు 60-80ు మాత్రమే ఉంటుందని వారు తెలిపారు. మహిళల వయసు, అండాల సేకరణ, శీతలీకరణ పద్ధతులు లాంటి ఎన్నో అంశాలు ఈ విజయశాతాన్ని నిర్ధారిస్తాయని వెల్లడించారు. అయితే, ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన విట్రిఫికేషన్‌ సాంకేతికత కారణంగా.. ప్రతి 10 అండాల్లో 9 ఎక్కువకాలంపాటు నాణ్యంగానే ఉంటున్నాయని చెప్పారు.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ.

క్యాన్సర్‌ బాధితులు చికిత్సకు ముందే..

ఆలస్యంగా వివాహం చేసుకునే వారు ముందే తమ అండాలను ఫ్రీజింగ్‌ చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలు.. ఏవైనా జబ్బులున్నవారు భవిష్యత్తులో సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనతో తమ అండాలను భద్రపరచుకుంటున్నారు. క్యాన్సర్లతో బాధపడే మహిళలు చికిత్సకు ముందే తమ అండాలను వైద్యుల సలహా మేరకుఫ్రీజ్‌ చేయిస్తున్నారు. ఎందుకంటే.. క్యాన్సర్‌ చికిత్స వల్ల అండాల సామర్ధ్యం తగ్గే అవకాశముమంది.

- డాక్టర్‌ వి.రాగసుధ, సీనియర్‌ ఫెర్టిలిటీ నిపుణులు, మెడికవర్‌ ఫెర్టిలిటీ

యువతుల్లో ఆసక్తి పెరిగింది

అండాల నిల్వపై ఇటీవలికాలంలో చాలా మందిలో అవగాహన పెరిగింది. ఉద్యోగాలు చేసే మహిళలు పెళ్లికి ముందే వైద్యులను ఆశ్రయించి దీనికి సంబంధించి సలహాలు తీసుకుంటున్నారు. నిల్వ చేసుకున్న అండాలను యువతులు తమ పెళ్లి అయిన 5 నుంచి 10 ఏళ్ల వరకు ఉపయోగించుకోవడానికి అవకాశముంది. అండాల నాణ్యత ఏ మాత్రం తగ్గదు. సేకరించిన సమయంలో ఏ నాణ్యత ఉంటుందో.. వినియోగించే సమయంలోనూ అదే నాణ్యత ఉంటుంది.

- డాక్టర్‌ ఎం.శ్రీలత, ఇన్‌ఫెర్టిలిటి నిపుణులు, కామినేని ఫెర్టిలిటి

Updated Date - Jun 09 , 2026 | 05:07 AM