ఐఏఎస్ అమోయ్ కుమార్‌కు ఈడీ సమన్లు
ABN , Publish Date - May 22 , 2026 | 04:06 AM
సీనియర్ ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను ఈ నెల 25న విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు.
భూదాన్ భూముల దందాలో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు
ఆ మూడు సేల్ డీడ్‌ల వివరాలతో 25న విచారణకు రావాలని ఆదేశం
గతంలోనూ విచారించిన ఈడీ
ఈసారి చట్టపర చర్యలకు చాన్స్?
హైదరాబాద్, మే 21(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐఏఎస్ అధికారి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను ఈ నెల 25న విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు. ఆయనపై మహేశ్వరం పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ గతంలో విచారణ ప్రారంభించింది. అందులో భాగంగా 2024 అక్టోబరులో పలుమార్లు ఆయనను ఈడీ అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, ధరణి రికార్డుల్లో మార్పులు, 22ఏ జాబితాలోని నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను మనీలాండరింగ్ కోణంలో విచారిస్తున్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో 42ఎకరాల భూదాన్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన విషయంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ధరణిలో ఈ భూములకు సంబంధించి మార్పులు చేర్పులు జరగడం, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు పూర్తయిన తర్వాత పాస్ పుస్తకాలు వచ్చిన వ్యవహారంపై ఒకవైపు పోలీసులు మరోవైపు ఈడీ అధికారులు దృష్టి సారించారు. అమోయ్ కుమార్ హయాంలో జరిగిన సేల్ డీడ్లు 1209, 1212, 4594 విషయంలో అవకతవకలు జరిగాయని ఈడీ గుర్తించింది. ఆయనకు ఇచ్చిన నోటీసుల్లో ఈ మూడు సేల్ డీడ్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. గతంలో ఆయన భూదందాపై విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలను ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. నాగారంలోని సర్వే నెంబర్ 181, 182లోని పది ఎకరాల భూమి విషయంలో స్థానికంగా ఉన్న వివాదాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకుని ఖాదరున్నీసా అనే మహిళ పేరిట భూమి రిజిస్ట్రేషన్‌కు సహకరించారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు అమోయ్‌ను ఈడీ విచారించడం, తాజాగా డాక్యుమెంట్లతో రావాలని సమన్లు ఇవ్వడంతో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.