Share News

గ్రానైట్‌, ఇసుక వ్యాపారులపై ఈడీ దాడులు

ABN , Publish Date - May 28 , 2026 | 03:45 AM

తెలంగాణలో గ్రానైట్‌, ఇసుక వ్యాపారులే లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు.

గ్రానైట్‌, ఇసుక వ్యాపారులపై ఈడీ దాడులు

  • హైదరాబాద్‌, కరీంనగర్‌లో 8 చోట్ల సోదాలు

  • కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేత, మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గ్రానైట్‌, ఇసుక వ్యాపారులే లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌, కరీంనగర్‌లలోని 8 ప్రధాన ప్రాంతాల్లో గల వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేతతో పాటు, ఆ నిధులను నకిలీ (షెల్‌) కంపెనీల ద్వారా హవాలా మార్గంలో మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు, సీఐఎ్‌సఎఫ్‌ బలగాల భద్రత నడుమ ఈ తనిఖీలు కొనసాగాయి. ఇటీవల కరీంనగర్‌ కేంద్రంగా జరిగిన భారీ జీఎస్టీ ఎగవేత వ్యవహారాన్ని డీజీసీఐ అధికారులు బట్టబయలు చేశారు. నకిలీ సంస్థల పేరిట బోగస్‌ ఇన్వాయి్‌సలు, ఈ-వే బిల్లులు సృష్టించి, సుమారు రూ.100 కోట్ల విలువైన గ్రానైట్‌ టైల్స్‌ను అక్రమంగా చైనాకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన దాసరి శ్రీకాంత్‌ అనే వ్యక్తిని ఈనెల 21న అధికారులు అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరచారు. ఈ భారీ కుంభకోణంతో కరీంనగర్‌లోని మరికొన్ని పాలిషింగ్‌ యూనిట్లకు కూడా సంబంధం ఉందనే అనుమానంతో తాజా సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. జీఎస్టీ ఎగ్గొట్టడం ద్వారా ఆర్జించిన నల్లధనాన్ని హవాలా మార్గంలో షెల్‌ కంపెనీలకు మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు, ఈ-వే బిల్లులు, జీఎస్టీ చెల్లింపు పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - May 28 , 2026 | 03:45 AM