చట్ట వ్యతిరేక కార్యకలాపాల పేరుతో..అమెరికన్లకు బురిడీ
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:11 AM
విదేశీ పౌరులను, మరీ ముఖ్యంగా అమెరికన్లను పన్ను బకాయిలు, రుణ బకాయిలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రమేయం పేరుతో బెదిరించి మోసాలకు పాల్పడుతున్న నకిలీ కాల్ సెంటర్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్...
కోట్ల రూపాయల వసూలు
నకిలీ కాల్ సెంటర్లలో ఈడీ సోదాలు
13.5 లక్షల నగదు, క్రిప్టో కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : విదేశీ పౌరులను, మరీ ముఖ్యంగా అమెరికన్లను పన్ను బకాయిలు, రుణ బకాయిలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రమేయం పేరుతో బెదిరించి మోసాలకు పాల్పడుతున్న నకిలీ కాల్ సెంటర్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైదరాబాద్ జోనల్ అధికారులు సోదాలు నిర్వహించారు. సైబరాబాద్ పోలీసులు, సీబీఐ ఢిల్లీ విభాగం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన ఈడీ ప్రత్యేక బృందం అహ్మదాబాద్‌లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. సైబరాబాద్ పోలీసులు, ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన కేసుల మేరకు మహమ్మద్ అన్సారి అలియాస్ మొహమ్మద్ ఇర్ఫాన్ అన్సారి, ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి, వికాస్ కె. నిమార్, దివ్యాంగ్ రవాల్, ప్రదీప్ వి. రాథోడ్ తదితరులు తమ అనుచరులతో కలిసి అక్రమ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి నడిపినట్లు ఈడీ గుర్తించింది. వేర్వేరు ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినా... అన్ని కేంద్రాల్లో అనుసరించిన తీరు ఒకే విధంగా ఉన్నట్లు ఈడీ అధికారులు కనుగొన్నారు. కాల్ సెంటర్ నిర్వాహకులు అమెరికా ప్రభుత్వ విభాగాల అధికారులుగా పరిచయం చేసుకుని కేసుల పేరుతో బాధితులపై బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. చట్టపరమైన చర్యల పేరుతో భయపెట్టి అమెజాన్ గిఫ్ట్ కార్డుల కొనుగోలు, డిజిటల్ చెల్లింపులు చేయించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. వచ్చిన మొత్తాన్ని బిట్‌కాయిన్ సహా ఇతర క్రిప్టోకరెన్సీలుగా మార్చినట్లు గుర్తించారు. అహ్మదాబాద్‌లో సోదాల సమయంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఆకిబ్ ఘాంచి వద్ద సుమారు 12 వేల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీ లభ్యమైంది. రూ. 13.5 లక్షల నగదు, కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.