Share News

వివేకా హత్య కేసులో..

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:46 AM

మాజీ సీఎం జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రూ.40 కోట్ల మనీలాండరింగ్‌ కోణంలో విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు.. ఈ కేసులో ఏ-2 సునీల్‌ యాదవ్‌ను గురువారం నిశితంగా విచారించారు.

వివేకా హత్య కేసులో..
ed logo

  • సునీల్‌ యాదవ్‌ను ప్రశ్నించిన ఈడీ

  • రూ.40 కోట్ల డీల్‌పై వాంగ్మూలం నమోదు

  • ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిలకూ నోటీసులు

  • 27, 28 తేదీల్లో విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రూ.40 కోట్ల మనీలాండరింగ్‌ కోణంలో విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు.. ఈ కేసులో ఏ-2 సునీల్‌ యాదవ్‌ను గురువారం నిశితంగా విచారించారు. అతడి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఇదే కేసులో ఏ-1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డిలను ఈ నెల 27, 28 తేదీల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అప్రూవర్‌ దస్తగిరి(ఏ-4), సునీల్‌ యాదవ్‌ చెప్పిన వివరాల ఆధారంగా వారిని ప్రశ్నించనున్నారు. గురువారం విచారణ అనంతరం సునీల్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడాడు. వివేకా హత్యకు ముందు తర్వాత తన బ్యాంకు ఖాతాల లావాదేవీలను ఈడీ అధికారులు అడిగారని, బ్యాంకు స్టేట్‌మెంట్లు అందజేశానని చెప్పాడు. హత్య కోసం రూ.40 కోట్ల ఫండింగ్‌ ఏర్పాటు, మనీ రూటింగ్‌ జరిగిందన్న విషయాలు తనకు తెలియవన్నాడు. హత్యతో తనకు సంబంధమే లేనప్పుడు డబ్బు ఎందుకు వస్తుందని ప్రశ్నించాడు.

Updated Date - Sep 25 , 2026 | 12:46 AM