Share News

ఈడీ అధికారులకే కోటి లంచం ఎర!

ABN , Publish Date - May 13 , 2026 | 03:58 AM

స్రవంతి గ్రూపు ప్రమోటర్‌ డీవీ రావు, అతని సోదరుడు డీఏ రావు (దండమూడి బ్రదర్స్‌) తమ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన విషయాన్ని విచారణ సందర్భంగా అంగీకరించారని తెలిసింది.

ఈడీ అధికారులకే కోటి లంచం ఎర!

  • ప్రలోభపెట్టడానికి ప్రయత్నించామని కస్టడీలో అంగీకరించిన దండమూడి బ్రదర్స్‌!

హైదరాబాద్‌, మే 12(ఆంధ్రజ్యోతి): స్రవంతి గ్రూపు ప్రమోటర్‌ డీవీ రావు, అతని సోదరుడు డీఏ రావు (దండమూడి బ్రదర్స్‌) తమ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన విషయాన్ని విచారణ సందర్భంగా అంగీకరించారని తెలిసింది. బ్యాంకులతో పాటు పలు ఆర్థిక సంస్థలను రూ.284 కోట్ల వరకు మోసం చేసిన దండమూడి బ్రదర్స్‌తో పాటు స్రవంతి గ్రూపు డైరెక్టర్‌ శాంతి కిరణ్‌ను ఈ నెల 9న అరెస్టు చేసిన ఈడీ అధికారులు, కోర్టు ఆదేశాలతో వారిని కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ గడువు మంగళవారం ముగియడంతో వారిని జైలుకు తరలించారు. తమ మీద నమోదైన ఈడీ కేసులో దర్యాప్తును ముందుకెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు అధికారులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన విషయాన్ని దండమూడి బ్రదర్స్‌ కస్టడీలో అంగీకరించారని సమాచారం. గత నెలలో ప్రీతీష్‌ కుమార్‌ అనే వ్యక్తికి డీఏ రావు పంపించిన రూ.కోటి నగదును ఈడీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్‌లో ఈడీ అధికారులను కలిసే మధ్యవర్తులకు ఆ డబ్బు ఇవ్వాలని దండమూడి సోదరులు ప్రీతీష్‌ కుమార్‌కు చెప్పిన విషయాన్ని ఇప్పటికే వాంగ్మూలంగా ఈడీ నమోదు చేసింది. దండమూడి బ్రదర్స్‌ చేసిన మోసంవల్ల వారికి రుణాలు ఇచ్చిన, వ్యాపార భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్వెస్టర్లకు రూ.1500 కోట్ల నష్టం జరిగిందని ఈడీ విచారణలో వెల్లడైంది. 3 రోజుల ఈడీ కస్టడీలో చాలా విషయాలకు డీవీ రావు సమాధానాలు చెప్పలేదని, మనీలాండరింగ్‌ కోణంలో కొన్ని విషయాలను అంగీకరించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - May 13 , 2026 | 03:58 AM