Share News

మద్యం రవాణా అక్రమాల కేసులో..అంతిమ లబ్ధిదారుకు త్వరలో ఈడీ నోటీసు!

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:22 AM

మద్యం రవాణా అక్రమాల కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించినట్లు తెలిసింది. త్వరలోనే ఆయనకు నోటీసు జారీచేయనున్నట్లు సమాచారం.

మద్యం రవాణా అక్రమాల కేసులో..అంతిమ లబ్ధిదారుకు త్వరలో ఈడీ నోటీసు!

  • వాసుదేవరెడ్డి, కసిరెడ్డి, సునీల్‌ను కస్టడీలో తొలి రోజు విచారించిన అధికారులు

  • బినామీ కంపెనీల పాత్ర, ముడుపులు,ఆ సొమ్ము ఎవరెవరికి చేరిందో ఆరా

  • నేడు, రేపూ కొనసాగనున్న విచారణ

హైదరాబాద్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా అక్రమాల కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించినట్లు తెలిసింది. త్వరలోనే ఆయనకు నోటీసు జారీచేయనున్నట్లు సమాచారం. ఈ స్కాంలో కోట్లాది రూపాయల ముడుపులు వివిధ మార్గాల్లో సదరు అంతిమ లబ్ధిదారుకే చేరాయని ఈడీ దర్యాప్తులో గుర్తించినట్లు తెలిసింది. నిందితుల విచారణ ఆ దిశగానే సాగుతున్నట్లు సమాచారం. లిక్కర్‌ రవాణా కేసులో కీలక పాత్ర వహించిన నాటి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్‌ను ప్రత్యేక కోర్టు ఆదేశాలతో గురువారం ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ముగ్గురినీ మూడ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ అధికారులు హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలు నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఆస్పత్రికి తరలించి.. వైద్యపరీక్షలతర్వాత ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. లిక్కర్‌ కుంభకోణంలో బినామీ కంపెనీల పాత్ర.. కమీషన్ల డబ్బు ఎటు వెళ్లింది.. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడుల రహస్యాలపై తొలిరోజు ప్రశ్నించినట్లు సమాచారం. శుక్ర, శనివారాల్లో కూడా ముగ్గురినీ విచారించనున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 05:24 AM