సిగ్మా, ప్రసాద్.. రికార్డుల్లోనే!
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:14 AM
ఏపీ మద్యం రవాణా అక్రమాల కుంభకోణంలో రవాణా కాంట్రాక్టులు పొందిన సిగ్మా, ప్రసాద్ సంస్థలు రికార్డుల్లో మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది.
వాటి లావాదేవీలన్నీ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి కనుసన్నల్లోనే!!
రెండోరోజు కస్టడీలో మద్యం రవాణా కాంట్రాక్టులపై ఈడీ విచారణ
నిందితుల కస్టడీ ముగిశాక అంతిమ లబ్ధిదారు విచారణ?
హైదరాబాద్, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం రవాణా అక్రమాల కుంభకోణంలో రవాణా కాంట్రాక్టులు పొందిన సిగ్మా, ప్రసాద్ సంస్థలు రికార్డుల్లో మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. వాటి వాస్తవ నిర్వహణ, ఆర్ధిక లావాదేవీలన్నీ పూర్తిగా కీలక నిందితులైన రాజ్ కసిరెడ్డి, నాటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి కనుసన్నల్లోనే సాగాయని తెలిసింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో వీరిద్దరితోపాటు వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రెండో రోజు విచారణలో ఈడీ అధికారులు మద్యం రవాణా విధానంపై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. సిగ్మా సంస్థ రవాణా కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత కూడా నిబంధ నలకు విరుద్ధంగా పదే పదే ఎందుకు కాంట్రాక్టు పొడిగించాల్సి వచ్చిందని వారిని అడిగినట్లు సమాచారం. మద్యం రవాణా చార్జీల పేరిట దాదాపు రూ.193 కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారని, ఈ కుట్రకు రాజ్ కసిరెడ్డి సూత్రధారి కాగా.. వాసుదేవరెడ్డి పాత్రధారిగా నిలిచారని ఈడీ ఇప్పటికే తేల్చింది. ముడుపులు ఎవరికి చేరాయి.. అంతిమ లబ్ధిదారు ఎవరని నిందితులను అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక అంతిమ లబ్ధిదారెవరో గుర్తించిన ఈడీ.. ఆయన్ను కూడా విచారించడానికి సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. శుక్రవారంతో ముగ్గురు నిందితులకు కస్టడీ ముగియనుంది. ఆ తర్వాత ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశముందని ఈడీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నాయి. మరికొందరికీ నోటీసులిస్తారని సమాచారం.