Share News

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ దూకుడు

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:37 AM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణలపై మనీలాండరింగ్‌ కోణం లో...

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ దూకుడు

  • దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు

  • నిందితులతో పాటు డెయిరీలు, వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు

  • కల్తీ నెయ్యి సరఫరాతో వచ్చిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు

  • రూ.45 కోట్ల ఆస్తుల గుర్తింపు.. రూ.60 లక్షల నగదు సీజ్‌: ఈడీ

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేసి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణలపై మనీలాండరింగ్‌ కోణం లో దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. బుధవారం దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు నిర్వహించింది. నెయ్యి సరఫరా చేసిన డెయిరీలు, ఆయా సంస్థల యజమానులు, వ్యాపారుల ఇళ్లు, కంపెనీల్లో సోదా లు నిర్వహించినట్లు హైదరాబాద్‌ ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రూ.60 లక్షల నగదును సీజ్‌ చేశారు. అలాగే కల్తీ నెయ్యి సరఫరా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలతో స్థిరాస్తులు కొన్నట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. అలా కూడబెట్టిన రూ.45 కోట్ల ఆస్తులను గుర్తించారు. అవన్నీ వారు, వారి కుటుంబసభ్యుల పేరిట ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు. తమిళనాడులోని ఏఆర్‌ డెయిరీ, అహిల్యానగర్‌(మహారాష్ట్ర)లోని మల్‌గంగ మిల్క్‌, రూర్కీ (ఉత్తరాఖండ్‌)లోని భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ ప్రొడక్ట్స్‌లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. టీటీడీలోని కొందరు అధికారుల భాగస్వామ్యంతో కల్తీ నెయ్యి సరఫరా కొనసాగిందని, ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల మనీలాండ రింగ్‌ జరిగినట్లు గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Updated Date - Jun 04 , 2026 | 05:37 AM