159 కోట్ల విలువైన హీరా గ్రూప్ ఆస్తుల వేలం
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:40 AM
హీరా గ్రూప్ వ్యవస్థాపకురాలు నౌహెరా షేక్ ఆస్తుల వేలాన్ని ఈడీ విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు రూ.159 కోట్ల విలువైన 23 స్థిరాస్తులను వేలం వేసింది.
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): హీరా గ్రూప్ వ్యవస్థాపకురాలు నౌహెరా షేక్ ఆస్తుల వేలాన్ని ఈడీ విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు రూ.159 కోట్ల విలువైన 23 స్థిరాస్తులను వేలం వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 19న ఎంఎ్‌సటీసీ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ వేలం నిర్వహించినట్లు ఈడీ అధికారులు శనివారం వెల్లడించారు. నౌహెరా షేక్, ఆమె అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారుల నుంచి రూ.5,978 కోట్లకు పైగా నిధులు సేకరించారు. ఏడాదికి 36 శాతానికి పైగా లాభాలు ఇస్తామని హామీ ఇచ్చి.. అసలు పెట్టుబడిని కూడా తిరిగి చెల్లించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. సీసీఎస్ ఫిర్యాదు ఆధారంగా రంగంలో దిగిన ఈడీ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద హీరా గ్రూప్‌నకు చెందిన పలు ఆస్తులను జప్తు చేసింది. పీఎంఎల్‌ఏ అథారిటీ ఈ అటాచ్‌మెంట్‌ను ధ్రువీకరించడంతో తాజాగా వేలానికి మార్గం సుగమమైంది. వేలం ద్వారా వచ్చిన రూ.159 కోట్లను బాధితులు, పెట్టుబడిదారులకు చెల్లించనున్నారు.