డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఆస్తులపై ఈడీ నజర్
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:09 AM
ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి చెందిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తుల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ) శాఖలు దృష్టిపెట్టినట్టు తెలిసింది.
కోట్లకొద్దీ సొమ్ముపై దర్యాప్తు
భీమ్‌రెడ్డి అస్వస్థతకు గురవడంతో అరెస్టు చేయని ఏసీబీ అధికారులు
విచారణకు రావాలంటూ నోటీసులు
ఇది ఏసీబీ చరిత్రలోనే అరుదైన పరిణామం అంటున్న అధికారులు
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ భీమ్‌రెడ్డికి చెందిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తుల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ) శాఖలు దృష్టిపెట్టినట్టు తెలిసింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భీమ్‌రెడ్డి భారీగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, కేసు ఫైళ్ల కాపీలను తమకు అందజేయాలని ఏసీబీని ఈడీ అధికారులు కోరినట్టు తెలిసింది. మనీ లాండరింగ్ కోణంలో భీమ్‌రెడ్డిపై ఈడీ విచారణ ప్రారంభించినట్టు సమాచారం. ఇక సోదాల్లో గుర్తించిన ఆస్తుల్లో 75శాతం బినామీల పేరిట ఉండటంతో ఆదాయ పన్ను శాఖలోని బినామీ నిరోధక విభాగం(బీపీయూ) అధికారులు కూడా విచారణకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇటీవలే ఐటీబీపీయూ అధికారులు ఒక మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన బినామీ ఆస్తులపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. భీమ్‌రెడ్డి తన సంపాదనతో ఈ స్థాయిలో ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాల్లేవని, ఇందులో చీకటికోణాలు చాలానే ఉన్నాయని, భీమ్‌రెడ్డి మరొకరికి బినామీ అయి ఉండవచ్చని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. భీమ్‌రెడ్డికి సంబంధించి ఏసీబీ గుర్తించిన 18 స్థిరాస్తుల్లో 75శాతం బినామీల పేరిటే ఉన్నాయని, అందులో చాలా వరకు గత పదేళ్లలో కొనుగోలు చేసినవేనని చెబుతున్నారు.డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆస్తుల వ్యవహారం, ఆయనను అరెస్టు చేయకుండా వదిలిపెట్టడంపై పోలీసుశాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. గురువార రాత్రి భీమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి వదిలిపెట్టామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. తమ ఎదుట తదుపరి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చామని అంటున్నారు. ట్రాప్ కేసుల్లోగానీ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోగానీ ఎన్నడూ ఇలా జరగలేదని.. భీమ్‌రెడ్డికి చివరి నిమిషంలో అరెస్టు నుంచి ఉపశమనం లభించడం ఏసీబీ చరిత్రలో అరుదైన పరిణామమని పోలీసు అధికారులు చెబుతున్నారు.