ఎకోటూరిజం అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి: కొండా సురేఖ
ABN , Publish Date - May 16 , 2026 | 04:42 AM
అడవుల సంరక్షణతోపాటు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి) : అడవుల సంరక్షణతోపాటు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. హరిత నిధి 7వ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో మంత్రి అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు హరిత నిధి కీలక వేదికగా పనిచేస్తోందన్నారు. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ప్రాజెక్టు సమర్థంగా అమలు కావాలన్నారు. అటవీ సంపదను కాపాడడం, జీవ వైవిధ్య పరిరక్షణ, ఎకోటూరిజం అభివృద్థితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి పలు కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. నర్సరీల ఏర్పాటు, అర్బన్ పార్కుల అభివృద్థి, అటవీ సంరక్షణ, అటవీ పరిశోధనలు, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు, ఎకోటూరిజం అభివృద్థికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.