Share News

kumaram bheem asifabad-ఎత్తిపోతలకు గ్రహణం

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:02 PM

జిల్లాలో ఎత్తిపోతల పథకాలకు నిధుల గ్రహణం వీడడం లేదు. ప్రభుత్వాలు ఎత్తిపోతల పథకాలను గాలి కొదిలేశాయి. జలవనరుల నుంచి పంటలకు సాగు నీరందించే ఉద్దేశ్యంతో జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగ నదుల వద్ద నిర్మించిన ఎత్తి పోతల పథకాలు ఆయకట్టుకు చుక్కనీరందించడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ పథకాలతో అన్నదాతలకు ప్రయోజనం కలుగడం లేదు. కొన్ని ఎత్తి పోతల పథకాల పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండగా మరి కొన్ని మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి.

kumaram bheem asifabad-ఎత్తిపోతలకు గ్రహణం
నిరుపయోగంగా ఉన్న కోర్సిని ఎత్తిపోతల పథకం

- నీరున్నా ఉపయోగించుకోలేని దుస్థితి

- మరమ్మతులను పట్టించుకోని పాలకులు

- అన్నదాతలకు తప్పని అవస్థలు

ఆసిఫాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎత్తిపోతల పథకాలకు నిధుల గ్రహణం వీడడం లేదు. ప్రభుత్వాలు ఎత్తిపోతల పథకాలను గాలి కొదిలేశాయి. జలవనరుల నుంచి పంటలకు సాగు నీరందించే ఉద్దేశ్యంతో జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగ నదుల వద్ద నిర్మించిన ఎత్తి పోతల పథకాలు ఆయకట్టుకు చుక్కనీరందించడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ పథకాలతో అన్నదాతలకు ప్రయోజనం కలుగడం లేదు. కొన్ని ఎత్తి పోతల పథకాల పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండగా మరి కొన్ని మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి. దీంతో రైతులకు సాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. జీవనదిని తలపించే ప్రాణహిత, పెన్‌గంగలపై కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూరు(టి) మండలాల్లో తొమ్మిది ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. కౌటాల మండలంలో సాండ్‌గాం, వీర్దండి, గుండాయిపేట, తుమ్మిడిహేట్టి గ్రామాల్లో ఎత్తి పోతల పథకాలుండగా ఏ ఒక్క పథకం కూడా పని చేయటం లేదు. చింతలమానేపల్లి మండలంలోని కోర్సిని, గూడెం, రన్‌వెల్లి ఎత్తిపోతల పథకాలు పూర్తికాక నిరుపయోగంగా మారాయి.

- 10 వేల ఎకరాలకు..

కౌటాల మండలంలో 10వేల ఎకరాలకు ప్రాణహిత జలాలను పొలాలకు అందించేందుకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో పదేళ్ల కిందట తుమ్మిడిహెట్టి, వీర్దండి, గుండాయిపేట, సాండ్‌గాం ఎత్తి పోతల పథకాలు నిర్మించారు. ఇవి కొన్ని రోజు పాటు ఆయకట్టు పొలాలకు నీరందించినప్పటికీ మోటార్లు చెడి పోవడంతో అవి అలంకారప్రాయం గా మారాయి. దీంతో అన్నదాతల ఆశలు అడియా శలయ్యాయి. చింతలమానేపల్లి మండలంలో ఎనిమిది వేల ఎకరాల సాగుకు నీరందించే లక్ష్యంతో కోర్సిని వద్ద నిర్మిస్తున్న ఎత్తి పోతల పథకం పనులు ఎనిమిదేళ్లుగా నత్తనడక పనులు కొనసాగుతున్నాయి. రూ.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ పథకం నేటికి పూర్తి కాలేదు. గూడెం, రనవెల్లి ఎత్తిపోత పథకాలు సైతం నేటికి పూర్తి కాక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి ఎత్తి పోతల పథకాలకు నిధులు కేటాయించి ఉపయోగంలోకి తీసుకరావాలని ఆయకట్టు దారులు కోరుతున్నారు.

- ఆయకట్టుదారుల్లో ఆందోళన..

జిల్లాలో ఎత్తిపోతల పథకాల కింద భూములను సాగు చేస్తున్న ఆయకట్టు దారుల్లో ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి ఎత్తిపోతల పథకాలు పూర్తికాక పోవడంతో పంట పొలాలకు చుక్కనీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు వెచ్చించి పథకాలు ప్రారంభించినా అవి పూర్తి కాకపోవడంతో వర్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో పుష్కలంగా జల వనరులున్నా ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో ఎత్తి పోతల పథకాలు పూర్తి కాకపోవడంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు చేపడితే ఈ ప్రాం తంలో రెండు పంటలు పండించే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jan 09 , 2026 | 11:02 PM